- మహాపూజలతో ప్రారంభమైన జాతర
- భేటింగ్‌తో మెస్రం వంశంలో చేరిన కొత్త కోడళ్లు
- 22న నాగోబా దర్బార్, 23న జాతర ముగింపు
ఇంద్రవెల్లి, వెలుగు : ఆసియాలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి గాంచిన, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నిర్వహించనున్న నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమైంది. పుష్యమాసంలో నెలవంక కనిపించిన అనంతరం మెస్రం వంశీయులు నాగోబా జాతరకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గత నెల 30న మెస్రం వంశీయులు కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా హస్తినమడుగుకు చేరుకొని అక్కడ సేకరించిన పవిత్ర గంగాజలంతో ఇప్పటికే కేస్లాపూర్ చేరుకున్నారు. ఆ గంగాజలంతో ఆదివారం అర్ధరాత్రి ఆదిశేషుడికి అభిషేకం చేసి మహాపూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. నాగోబా జాతర మహాపూజా కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, అనిల్ జాదవ్, పాయల్ శంకర్ పాల్గొన్నారు.
ఉదయం నుంచే సంప్రదాయ పూజలు
నాగోబా జాతరలో భాగంగా ఆదివారం ఉదయం నుంచే మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉదయాన్నే మురాడీ (పురాతన నాగోబా ఆలయం) నుంచి నాగోబా విగ్రహం, పూజ సామగ్రితో పాటు మర్రిచెట్టుపై భద్రపరచిన పవిత్ర గంగాజలాన్ని తీసుకొని నాగోబా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం సిరికొండ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కుండలను మెస్రం వంశ పెద్దలు 22 కితల వారీగా కొత్త కోడళ్లకు అందించారు. వారు పాదయాత్రగా బయలుదేరి మర్రిచెట్ల సమీపంలో ఉన్న కోనేరు వద్దకు చేరుకొని అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం కోనేటి నీటిని కుండల్లో సేకరించి నాగోబా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పాత పుట్టను మెస్రం వంశీయుల అల్లుండ్లు తవ్వగా, ఆ మట్టితో కొత్త కోడళ్లు, మెస్రం వంశీయుల అడపడుచులు కొత్త పుట్టలను తయారు చేశారు. అందులో నుంచి తీసిన మట్టిని ఉండలుగా తయారు చేసి ఆలయంలోని సతిక్ దేవతల వద్ద ఉంచి, అక్కడే ఏడు వరుసలుగా పేర్చి బౌల దేవతలను చేసి పూజలు చేశారు.
23 వరకు కొనసాగనున్న జాతర
నాగోబా మహాపూజతో ఆదివారం ప్రారంభమైన జాతర ఈ నెల 23 వరకు కొనసాగనుంది. జాతరలో భాగంగా 20న పెర్సపేన్, బాన్ పేన్ పూజలు, 22న నాగోబా దర్బార్ నిర్వహించనున్నారు. 23న బేతాల్‌పూజ, మండగాజాలింగ్ పూజలతో నాగోబా జాతర ముగియనుంది. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కొత్త కోడళ్ల భేటింగ్
కొత్తగా పెళ్లయి మెస్రం వంశంలోకి అడుగుపెట్టిన కోడళ్లను భేటింగ్ ద్వారా నాగోబాకు పరిచయం చేయడం వారి ఆచారం. ఇందులో భాగంగా నాగోబాకు మహాపూజ చేసిన అనంతరం భేటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న కొత్తకోడళ్లతో మెస్రం ఆడపడుచులు సతీ దేవతతో పాటు నాగోబాకు పూజలు చేయించారు. అనంతరం మెస్రం వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. భేటింగ్ కార్యక్రమం అనంతరం కొత్త కోడళ్లు మెస్రం వశంలో చేరినట్లు భావిస్తారు.
