ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుదాం

ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుదాం

తెలంగాణ బచావో సదస్సులో వక్తల పిలుపు
అమరుల నుంచి స్ఫూర్తి పొందాలి : కోదండరాం
రాజకీయ వ్యవస్థలు దిగజారిపోయాయ్ : హరగోపాల్​
బీసీలను తొక్కేస్తున్నరు : ప్రజా గాయకుడు గద్దర్
పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక్కడి పాలైంది: అందెశ్రీ
అన్ని రంగాలను నాశనం చేసిన్రు: ఆకునూరి మురళి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతున్నదని, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ప్రతీ ఒక్కరు పోరాడాలని వక్తలు పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చి తొమ్మిదేండ్లు అవుతున్నా ఏ ఒక్క లక్ష్యం నెరవేరలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్​ది అని ఫైర్ అయ్యారు. మిలియన్ మార్చ్ నిర్వహించి 12ఏండ్లు పూర్తయిన సందర్భంగా వీఎస్టీ ఫంక్షన్ హాల్​లో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ‘‘తెలంగాణ బచావో సదస్సు’’ నిర్వహించారు. సదస్సుకు ఢిల్లీ నుంచి భారత్ జోడో అభియాన్ లీడర్ ప్రొ.యోగేంద్ర యాదవ్ చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మేధావులు, ఉద్యమకారులు మాట్లాడారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అమరవీరుల గాథల నుంచి ప్రతీ ఒక్కరు స్ఫూర్తి పొందాలని ప్రజలకు సూచించారు. ప్రజాస్వామ్య రాజకీయాలు నిర్మించేందుకు చర్చ జరగాలని కోరారు. ప్రజాకవి అందెశ్రీ మాట్లాడుతూ.. వేలాది మంది అమరుల త్యాగాలతో తెలంగాణ వచ్చిందన్నారు. కానీ, పాలన మొత్తం ఒక్క కుటుంబం పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనతో ప్రజలందరూ విసుగెత్తి పోయారన్నారు. తెలంగాణ కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేశామని గుర్తు చేశారు. సారు (కేసీఆర్) కుటుంబం, సారు చుట్టాలు, సారుకు భజన చేసేటోళ్లే తెలంగాణను పాలిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఓ అనామకుడు అని ఎద్దేవా చేశారు. కోట్లాది మంది ప్రజల బలం, పోరాటంతో తెలంగాణ వచ్చిందన్నారు. సైలెంట్​గా ఉన్నన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఇంకా పాలించాలని కేసీఆర్ ఫ్యామిలీ ప్లాన్​ చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ అంటే బీర్ ఆఫ్ ఇండియా, బిజినెస్ ఆఫ్ ఇండియా అని విమర్శించారు. 

రాష్ట్రంలో నిర్బంధ పాలన : గుమ్మడి నర్సయ్య

రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్​ ఏ జిల్లాకు వెళ్లినా ప్రతిపక్ష లీడర్లను అరెస్ట్​ చేస్తున్నారన్నారు. పేదోళ్లకు భూములు పంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందని ప్రొఫెసర్ రమా మెల్కోటే అన్నారు. ఆధిపత్యం, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న పరిస్థితి తెలంగాణలో ఇంకా ఉందని విమర్శించారు. కొత్త ల్యాండ్ పాలసీ తీసుకురావాలని రైతు స్వరాజ్య వేదిక నేత ఉష లక్ష్మి అన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న మాజీ కలెక్టర్ కు 33 జిల్లాల్లో భూములున్నాయని ఆరోపించారు. అమరుల కుటుంబాలకు న్యాయం చేయలేని కేసీఆర్.. దేశాన్ని బాగు చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్​ను గద్దె దించితేనే తెలంగాణను కాపాడొచ్చని సూచించారు. 33 జిల్లాలు రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా మారాయని, విద్య, వైద్య రంగాలను కేసీఆర్ నాశనం చేశారని వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ విమర్శించారు.

అనుకున్న తెలంగాణ ఇది కాదు : హరగోపాల్

రాజకీయ వ్యవస్థలు దిగజారిపోయాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సమాజాన్ని నాశనం చేసే రాజకీయ నాయకుల కోసం తెలంగాణవాదులు పోరాటం చేయలేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య రాజకీయాల కోసమే తమలాంటి వాళ్లు ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. మనం అనుకున్న తెలంగాణ ఎటు పోయిందో తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు తెలంగాణ బచావో.. రేపు భారత్ బచావో అనే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. 

వెనుకబడిన కులాలను తొక్కేస్తున్నరు : గద్దర్​

రాష్ట్రంలో 59% మంది బీసీలు ఉన్నారని, మిగితా వాళ్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉంటే.. 4 శాతం ఉన్నోళ్లే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. బీసీలను అన్ని రంగాల్లో తొక్కేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఎంతో పోరాడామని గుర్తు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్​ దేశం మీద పడ్డారని విమర్శించారు. ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించుకున్నామో అది ఇప్పటికీ నెరవేరలేదన్నారు. కొట్లాట షురూ చేయాలని, ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సమస్యలపై వినతిపత్రం ఇద్దామంటే కేసీఆర్​ అపాయింట్​మెంట్ ఇవ్వట్లేదని ఫైర్ అయ్యారు.

ప్రజల బతుకులు మారడం లేదు : ఆకునూరి మురళి

తొమ్మిదేండ్లుగా  రాష్ట్రం ఎంతో గోసపడుతున్నదని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. అన్ని రంగాలను కేసీఆర్ నాశనం చేశారని ఫైర్​ అయ్యారు. సర్కార్ భూములు అమ్మేస్తూ పాలన అందిస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్​తో పాటు అప్పులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రజల బతుకులు మాత్రం మారడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో మాఫియా పెరిగిందన్నారు. రైతుల ఆత్మహత్యలు, మహిళలపై దాడులు ఆగడం లేదని ఫైర్ అయ్యారు. అందరూ అనుకున్నదానికి రివర్స్​గా రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నదన్నారు.