బెంగళూరులో ఆటోలు, క్యాబ్స్, ప్రైవేట్ బస్సులు బంద్

బెంగళూరులో ఆటోలు, క్యాబ్స్, ప్రైవేట్ బస్సులు బంద్

బెంగళూరులో  ప్రైవేట్ ట్రాన్స్  పోర్ట్ యజమానులు సమ్మెబాట పడుతున్నారు.   సెప్టెంబర్ 11న నగరంలో బంద్ పాటిస్తామని 32 సంస్థలు పిలుపునిచ్చాయి.   సెప్టె్ంబర్ 10 వ తేది అర్దరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని  నిర్వాహకులు తెలిపారు.  తమ సమస్యల పట్ల ప్రభుత్వం  స్పందించడం లేదని యూనియన్ ఆఫ్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.  

కర్నాటక  రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి  సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యాజమాన్యం  ఆగస్టు 30 లోగా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించలేదని తెలిపారు. సెప్టె్ంబర్ 11న బెంగళూరులో జరిగే బంద్ లో 5 లక్షల ఆటోలు, 3 లక్షల ట్యాక్సీలు, 55 వేల ప్రైవేట్ బస్సుల యజమానులు, డ్రైవర్లు పాల్గొంటున్నారని యూనియన్ ఆఫ్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ ప్రెసిడెంట్ నటరాజ్ శర్మ తెలిపారు. 

యూనియన్ ఆఫ్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ నిర్ణయానికి వ్యతిరేకంగా వాహనాలను తిప్పితే జరిగే ఘటనలకు తాము బాధ్యత వహించమని శర్మ హెచ్చరించారు.  సమ్మె వలన ఎలాంటి పరిణామాలు జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అల్టిమేటం జారీ చేశారు. సమ్మె కారణంగా బెంగళూరులో రవాణా సేవలకు తీవంర అంతరాయం ఏర్పడుతుంది.  బెంగళూరు ప్రజల రోజువారీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.