మొబైల్​ యాప్ ఫోన్లకు వస్తున్న లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

మొబైల్​ యాప్ ఫోన్లకు వస్తున్న లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఖైరతాబాద్, వెలుగు: ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలు, లోన్​ యాప్ ల ఆగడాలు అడ్డుకుని రక్షణ కల్పించేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని పలువురు వక్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్​ చేశారు. ఇండియన్ నేషనలిస్ట్స్ మూవ్ మెంట్, ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘తెలుగు రాష్ట్రాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు’ అంశంపై మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సదస్సు జరిగింది. దీనికి ఇండియన్ నేషనలిస్ట్స్ మూవ్ మెంట్ అధ్యక్షుడు డాక్టర్ మోటూరి కృష్ణప్రసాద్ హాజరై మాట్లాడారు. వడ్డీ వ్యాపారాలపై ప్రభుత్వాల పర్యవేక్షణ లోపించడంతోనే వేధింపులు, దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయన్నారు. ప్రైవేటు ఆర్థిక సంస్థల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మనోధైర్యం కల్పించేందుకు, మధ్యవర్తిత్వం చేసేందుకు ఆర్బిట్రేషన్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్ ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ డాక్టర్ అవులప్ప అభిప్రాయపడ్డారు.

ఆర్థికపరమైన అంశాల్లో, రుణాలు తీసుకునే విషయంలో మొబైల్​ యాప్ ఫోన్లకు వస్తున్న సమాచారం, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచించారు. తర్వాత రెండు ఆర్బిట్రేషన్​ కమిటీలను ఏర్పాటు చేస్తూ సదస్సు తీర్మానించింది. చైర్మన్​గా డాక్టర్​ అవులప్ప, సభ్యులుగా కృష్ణారెడ్డి, ఆర్.శంకర్​ ఉన్నారు.  అదేవిధంగా బహిరంగ విచారణ కమిటీ ఏర్పాటు చేయగా.. చైర్మన్​ జస్టిస్​ చంద్రకుమార్, సభ్యులుగా అవులప్ప, గౌరీ శంకర్​ఉన్నారు.