
- రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఓకే
- నేడు ఫారెస్ట్ మార్టైర్స్ డే..నెహ్రూ జూపార్క్‌లో ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: అడవుల సంరక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్న అటవీశాఖ అధికారులకు గౌరవం దక్కనుంది. ఇకపై అటవీ అధికారులు, సిబ్బంది చేసిన విశిష్ట సేవలను గుర్తించి, వారికి వివిధ విభాగాల్లో అవార్డులను ప్రకటించనున్నారు. వన్యప్రాణి సంరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపు, కలప అక్రమ రవాణా నిరోధం వంటి విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం.
దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ అవార్డులను ఏటా జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 11(గురువారం) ప్రకటించనున్నారు. అటవీశాఖ అధికారులు, సిబ్బందిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
గురువారం హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో నేషనల్ ఫారెస్ట్ మార్టైర్స్ డే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అటవీశాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక స్మారక స్తాపం వద్ద నివాళి అర్పించనున్నారు. సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ హాజరవుతున్నారు. తెలంగాణ అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, పీసీసీఎఫ్ సువర్ణ, చీప్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈలుసింగ్ మేరు పాల్గొననున్నారు.