ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు ప్రదానం

 ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు ప్రదానం

హైదరాబాద్, వెలుగు: శ్రావణ మాసం, రాఖీ పౌర్ణమి చాలెంజ్‌‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు ప్రదానం చేశారు. శనివారం హైదరాబాద్‌‌లోని బాగ్‌‌ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌‌లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. రాఖీ పౌర్ణమి, శ్రావణ మాసం చాలెంజ్‌‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రీజియన్లకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌‌‌‌ ట్రోఫీలను అందజేశారు. జోనల్ స్థాయి ఉత్తమ ఉద్యోగులకు, ఎక్స్‌‌ట్రా మైల్‌‌ సాధించిన వారికి అవార్డులు ఇచ్చారు. మొత్తం 286 మంది డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులకు అవార్డులు అందచేశారు. 

ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ, రాఖీ పౌర్ణమికి ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రావడం గొప్ప విషయమన్నారు. శ్రావణ మాసంలో చాలెంజ్‌‌లోనూ గతేడాదితో పోల్చితే అదనపు ఆదాయం వచ్చిందని చెప్పారు. అలాగే, రాబోయే 100 రోజులు కూడా సంస్థకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతితో పాటు శుభ ముహుర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయని, దీంతో ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఈ క్రమంలో 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ చాలెంజ్‌‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు సజ్జనార్‌‌‌‌ తెలిపారు. ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 22 వరకు ఈ చాలెంజ్ అమల్లో ఉంటుందని చెప్పారు. 

కార్మికులకు అన్ని బకాయిలు చెల్లిస్తాం..

ఆర్టీసీ కష్టకాలంలో ఉన్నప్పటికీ 2017 నుంచి విడతల వారీగా పెండింగ్‌‌లో ఉన్న 9 డీఏలను ఉద్యోగులకు చెల్లించామని సజ్జనార్‌‌‌‌ తెలిపారు. బకాయిల విషయంలో కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎరియర్స్, సీసీఎస్ నిధులు, బాండ్లకు సంబంధించిన ప్రతి రూపాయి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బకాయిలు చెల్లింపు విషయంలో ప్లాన్ రెడీ చేశామని తెలిపారు.  

నగదు పురస్కారాలు.. 


రాఖీ పౌర్ణమి చాలెంజ్: ఫస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్ (రూ.లక్ష), సెకండ్ బెస్ట్ రీజియన్ నల్గొండ (రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ కరీంనగర్ (రూ.50 వేలు)
శ్రావణ మాసం చాలెంజ్: ఫస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్ (రూ.లక్ష), సెకండ్ బెస్ట్ రీజియన్ నల్గొండ (రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ ఆదిలాబాద్ (రూ.50 వేలు)