నోట్ల రద్దు అంశాన్నీ విచారించాల్సిందే : సుప్రీం

నోట్ల రద్దు అంశాన్నీ విచారించాల్సిందే : సుప్రీం
  • ప్రభుత్వ నిర్ణయాల మీద విచారణపై సుప్రీం
  •  వాదనలు విని సమాధానం ఇవ్వడం మా బాధ్యత
  • ఐదుగురు జడ్జీల ధర్మాసనం వెల్లడి

న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై న్యాయ సమీక్ష విషయంలో ‘లక్ష్మణ రేఖ’ ఉన్నట్లు తెలుసని, అయినప్పటికీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై విచారణ చేపట్టాల్సిన బాధ్యత తమకుందని సుప్రీం కోర్టు చెప్పింది. ఈమేరకు జస్టిస్​ ఎస్​ఏ నజీర్​ ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జీల బెంచ్​ బుధవారం ఈ కామెంట్​ చేసింది. పెద్దనోట్ల రద్దును సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​లపై సుప్రీం కోర్టు బుధవారం నుంచి విచారణ ప్రారంభించింది. ‘‘కాన్​స్టిట్యూషన్​ బెంచ్​ ముందు ఏ అంశం వచ్చినా.. దానిపై విచారించి సమాధానం ఇవ్వడం మా డ్యూటీ. 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసింది. అయితే, ఈ నిర్ణయం పాలనాపరమైన అంశమా..? లేదా..? అనేది కూడా పరిశీలిస్తాం. జ్యూడిషియల్​ ఎంక్వైరీలో మా పరిధి(లక్ష్మణరేఖ) మాకు తెలుసు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాతే మా నిర్ణయమేంటో ప్రకటిస్తాం”అని జస్టిస్​ ఎస్​ఏ నజీర్, జస్టిస్​ బీఆర్​ గవాయి, జస్టిస్​ ఏఎస్​ బోపన్న, జస్టిస్​ వి.రామసుబ్రమణియన్, జస్టిస్​ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తెలిపింది. ‘‘మా ముందు ఉన్న సమస్య, అకడమిక్​ నా..? నాన్​ అకడమిక్ నా..? పరిశీలిస్తాం. న్యాయ సమీక్ష పరిధి దాటుతుందా..? అనేది కూడా చూస్తాం”అని బెంచ్​ వివరించింది.

కోర్టు టైం వేస్ట్​ చేయొద్దు: ఎస్​జీ​ తుషార్​ మెహతా

అకడమిక్​ అంశాలపై విచారణ చేపట్టి కోర్టు టైం వేస్ట్​ చేయొద్దని ప్రభుత్వం తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై పిటిషనర్​ వివేక్​ నారాయణ్​ శర్మ తరఫు సీనియర్​ అడ్వొకేట్​ శ్యాం దివాన్​ స్పందించారు. తుషార్​ మెహతా వాదనలను ఖండిస్తున్నట్టు చెప్పారు. గతంలో ఈ పిటిషన్లను కింది స్థాయి బెంచ్​ విచారించిందని, దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలంటే రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని పేర్కొన్న విషయాన్ని శ్యాం దివాన్​ కోర్టుకు గుర్తుచేశారు. ఈ సమస్య అకడమిక్ అవునో కాదో తేల్చాల్సింది కూడా సుప్రీంకోర్టేనని మరో పిటిషన్​ తరఫు సీనియర్​ అడ్వొకేట్ పి.చిదంబరం కోర్టుకు విన్నవించారు. నోట్ల రద్దుకు ప్రత్యేక చట్టం అవసరమని అభిప్రాయపడ్డారు. 2016, నవంబర్ 8న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీన్ని సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్​లు దాఖలయ్యాయి. వాటన్నింటిని పరిశీలించిన అప్పటి చీఫ్​ జస్టిస్​ టీఎస్​ ఠాకూర్​, రాజ్యాంగ ధర్మాసనానికి ట్రాన్స్​ఫర్​ చేశారు.