అరిగోస పడుతున్న ఆయకట్టు రైతులు

అరిగోస పడుతున్న ఆయకట్టు రైతులు
  • గూడెం లిఫ్ట్​కు కొత్త పైపులు వేస్తామన్న మంత్రి హరీశ్ హామీ నెరవేరలే

మంచిర్యాల/లక్సెట్టిపేట, వెలుగు: కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరందించేందుకు నిర్మించిన మంచిర్యాల జిల్లాలోని గూడెం ఎత్తిపోతల పథకం తరచూ మొరాయిస్తోంది. ఏటా యాసంగి పంటలకు సరిగా నీరందక దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల చివరి ఆయకట్టు రైతులు అరిగోస పడుతున్నారు. కడెం రిజర్వాయర్ ద్వారా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని 70 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. కానీ ప్రాజెక్టులో సరిపడా నీళ్లు లేకపోవడం, కాల్వల నిర్వహణ లోపాల వల్ల ఏనాడూ పూర్తి స్థాయిలో పారిన దాఖలాలు లేవు. దీంతో మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని 30 వేల ఎకరాల చివరి ఆయకట్టును స్థిరీకరించేందుకు గూడెం లిఫ్ట్​నిర్మించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 3 టీఎంసీల నీటిని దండేపల్లి మండలంలోని తానిమడుగు వద్దనున్న కడెం డిస్ర్టిబ్యూటరీ కెనాల్​లో ఎత్తిపోసి చివరి ఆయకట్టుకు అందించేలా ఈ స్కీం రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం మొదలుపెట్టి తెలంగాణ వచ్చాక 2015లో పనులు పూర్తి చేశారు. కానీ వివిధ కారణాల వల్ల ఎనిమిదేండ్లు గడిచినా గూడెం లిఫ్ట్ లక్ష్యం నెరవేరడం లేదు.

పైపులైన్ నిర్మాణంలో లోపాలు

గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలో ప్రధానమైన పైపులైన్ నిర్మాణంలో లోపాలే ఆయకట్టు రైతులకు శాపంగా మారాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. రెండు భారీ మోటార్ల ద్వారా 12 కిలోమీటర్ల దూరంలోని తానిమడుగు వద్దనున్న కడెం కెనాల్లో నీళ్లను ఎత్తిపోయాలి. కానీ రెండు మోటార్లను ఆన్ చేస్తే ప్రెజర్​ తట్టుకోలేక పైపులు పగిలిపోతున్నాయి. ఒక్క మోటార్​నడిపిస్తే చివరి ఆయకట్టు దాకా అందడం లేదు. దీంతో రైతులకు రెండో పంటకు నీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రెండేళ్ల కిందట గూడెం లిఫ్ట్ జీఆర్పీ పైపులను మార్చి వాటి స్థానంలో ఎమ్మెస్ పైపులను వేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీశ్​రావు అసెంబ్లీలో చెప్పారు. ఇప్పటివరకు పైపులను మార్చకపోవడంతో ప్రతి ఏటా మోటార్లు స్టార్ట్ చేయగానే పైపులు పగిలిపోతున్నాయి. దీంతో మళ్లీ రిపేర్ల పేరుతో కాలయాపన జరుగుతోంది. 

రైతుల ఆందోళన

ఈ ఏడాది కూడా యాసంగి కోసం మూడు మండలాల రైతులు నార్లు పోసుకున్నారు. అయితే నిరుడు జూలైలో వచ్చిన వరదలకు గూడెం లిఫ్ట్ పూర్తిగా మునిగిపోయింది. సుమారు రూ.11 కోట్ల నష్టం జరిగింది. అధికారులు ఇటీవలే రిపేర్లు పూర్తి చేసి మోటార్లు స్టార్ట్ చేశారు. సాగునీరు విడుదల చేసిన రెండు మూడు రోజులకే పైపులు పగలడం, సాంకేతిక లోపాల కారణంగా బ్రేక్ పడింది. పంటలు ఎండిపోతుండడంతో ఆగ్రహించిన అన్నదాతలు ఈ నెల12న లక్సెట్టిపేటలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. స్పందించిన ఇరిగేషన్ అధికారులు సాయంత్రంలోగానే సాగునీరు విడుదల చేస్తామని చెప్పారు. వారు హామీ ఇచ్చి నాలుగు రోజులైనా సాగునీరు విడుదల చేయకపోవడంతో సంక్రాంతి పండుగ రోజు మళ్లీ జాతీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. లిఫ్ట్ రిపేర్లు పూర్తయ్యాయని సాగునీరు విడుదల చేస్తామని అధికారులు చెప్పి వారం రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు పంటలకు నీరందకపోవడం గమనార్హం.

మూడెకరాలు ఎండుతోంది

మూడెకరాల్లో నాటేసిన. ఇప్పటికి నెల దాటింది. గూడెం లిఫ్ట్ నుంచి నీళ్లు ఇయ్యలే. బాయిల సుత లేవు. పొలం ఎండిపోతంది. ఎకరానికి ఇరవై వేలకు పైనే పెట్టుబడి అయ్యింది. నాలుగైదు రోజులల్ల నీళ్లు రాకుంటే పొలం ఎత్తిపోతది.  

- చింతకింది స్వామి, తిమ్మాపూర్

ఏటా ఎదురుచూపులే... 

గూడెం లిఫ్ట్ నుంచి యాసంగి పంటలకు నీళ్లిస్తమన్నరు. కానీ ఎన్నడూ సక్కగ రాలే.  ఏటా ఎదురుచూపులే అవుతున్నయి. ఈసారి ఏడెకరాలల్ల నాటేసిన. బాయి కింద నాలుగెకరాలు పారుతంది. వారంల కాల్వ నీళ్లు రాకుంటే మూడెకరాలు పోతది. 

- తోట మల్లేశ్, రైతు, హన్మంతుపల్లి

ఎస్సారెస్పీ నుంచి నీళ్లియ్యాలె 

గూడెం ఎత్తిపోతల పథకం పైపులు నాణ్యత లోపం వల్ల పగిలిపోతున్నాయి. దాంతో యాసంగి పంటలకు సాగు నీరు అందడం లేదు. ఈ ఏడాది కూడా ఆయకట్టు పంటలు ఎండిపోతున్నాయి. తక్షణమే ఎస్సారెస్పీ నుంచి వాటర్ రిలీజ్ చేసి రైతులను ఆదుకోవాలి. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్​లో ఇరిగేషన్ ఈఎన్సీని కలిసి మెమోరాండం సైతం అందజేశాం. 

- నైనాల గోవర్థన్, తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్