రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు.. అంబానీ ఫ్యామిలీ.. రూ.2.51 కోట్ల విరాళం

రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు.. అంబానీ ఫ్యామిలీ.. రూ.2.51 కోట్ల విరాళం

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న అంబానీ కుటుంబం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు 2.51 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. అంతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన భార్య నీతా, కుమారులు ఆకాష్, అనంత్, కోడలు శ్లోకా మెహతా, త్వరలో కాబోయే కోడలు రాధిక మర్చంట్, కుమార్తె ఇషా, అల్లుడు, పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమల్ తో కలిసి రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారు.  

రూ.2.51 కోట్ల విరాళం

ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ. 2.51 కోట్లు విరాళంగా అందించారని అంబానీ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. ట్రస్టు ఎంపిక చేసిన అతిథుల జాబితాలో.. ఈ వేడుకకు ఆహ్వానించబడిన ప్రముఖ వ్యాపార వ్యక్తులలో వ్యాపార దిగ్గజం అంబానీ కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి సినీ తారలు, క్రీడాకారులు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు, ప్రధాన పూజారులు కూడా ఉన్నారు.

అంతకుముందు రామమందిరం పవిత్రోత్సవంలో భాగమైన ముఖేష్ అంబానీ.. ఈరోజు రాముడు వస్తున్నాడని, ఈరోజు దేశం మొత్తం దీపావళిని జరుపుకోనుందని అన్నారు. ఇది చారిత్రాత్మకమైన రోజు అని నీతా అంబానీ అన్నారు.