అయోధ్య ఆదాయం రూ.363.34 కోట్లు

అయోధ్య ఆదాయం రూ.363.34 కోట్లు
  • ఏడాదిలో ఆలయం, ప్రాంగణంలోని నిర్మాణాల ఖర్చు రూ.776 కోట్లు
  • ఆదాయ వివరాలు వెల్లడించిన రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌‌‌‌

లక్నో : అయోధ్యలోని భవ్య రామాలయానికి తొలి ఏడాది రూ.363.34 కోట్ల ఆదాయం సమకూరిందని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌‌‌‌ తెలిపింది. ట్రస్ట్‌‌‌‌ ధర్మకర్తల మండలి 2023–-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖర్చు, ఆదాయ వివరాలను వెల్లడించింది. రామ మందిరం దాని ఆలయ ప్రాంగణాల్లో నిర్మాణాలకు ఏడాదిలో రూ.776 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఇందులో ప్రధాన ఆలయ నిర్మాణానికే రూ.540 కోట్లు ఖర్చయ్యాయని తెలిపింది.

కాగా, ఇప్పటివరకు ఆలయ నిర్మాణానికి మొత్తం సుమారుగా రూ.1,850 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించింది. అలాగే, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆలయ నిర్మాణం, ఇతర సంబంధిత పనులకు సంబంధించి రూ.850 కోట్లు ఖర్చు అయ్యే అవుతుందని ట్రస్ట్‌‌‌‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌‌‌‌ రాయ్‌‌‌‌ తెలిపారు. గతేడాది భక్తులు వేసిన కానుకల రూపంలో స్వామివారికి రూ.363.34 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇందులో బ్యాంకు వడ్డీ కింద రూ.204 కోట్లు, అయోధ్యలోని తన కార్యాలయంలో నగదు, చెక్కు ద్వారా మరో రూ.58 కోట్లు వచ్చాయన్నారు.

ఆలయంలోని డొనేషన్‌‌‌‌ బాక్సుల్లో ట్రస్టుకు రూ.24.50 కోట్ల నగదు వచ్చిందని వెల్లడించారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ డొనేషన్స్‌‌‌‌ రూపంలో రూ.71 కోట్లు, విదేశాల్లో ఉన్న భక్తులు రూ.10.43 కోట్లు విరాళంగా ఇచ్చారని తెలిపారు. మరోవైపు, సెక్యూరిటీ ప్రింటింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ మింటింగ్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియాకు 900 కేజీల వెండి, 20 కేజీల బంగారాన్ని అందజేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌లోని ఎస్‌‌‌‌పీఎంసీ ఆఫీసులో దీనిని పరీక్షించనున్నారు. మరోవైపు, ఒక భక్తుడు పీఎం రిలీఫ్‌‌‌‌ ఫండ్‌‌‌‌ పేరుతో రూ.2,100 కోట్ల చెక్కును ట్రస్టుకు పోస్ట్‌‌‌‌ ద్వారా పంపినట్లు రాయ్‌‌‌‌ వెల్లడించారు. ఈ చెక్కును తాము ప్రధాని కార్యాలయానికి పంపామన్నారు.