ఆనందయ్యకు ప్రాణహాని ఉంది: సీపీఐ నారాయణ

ఆనందయ్యకు ప్రాణహాని ఉంది: సీపీఐ నారాయణ
  • కార్పొరేట్ మెడికల్ మాఫియా ఆనందయ్యకు వ్యతిరేకంగా పోరాడుతోంది
  • ఆనందయ్యను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది
  • 70 వేల మందికి వైద్యం చేస్తే ఒక్కడిని చూపించి తప్పుపట్టడం సరికాదు
  • దుష్ప్రభావం లేదని తేలితే మందుల పంపిణీ ఆపడం ఎందుకు..?
  • వెంకయ్యనాయుడు స్పందించి ఆనందయ్య మందును వెంటనే అందుబాటులోకి తేవాలి: సీపీఐ నారాయణ
  • కృష్ణపట్నంలో ఆనందయ్య కేంద్రాన్ని పరిశీలించిన సీపీఐ నారాయణ

నెల్లూరు: జిల్లాలోని కృష్ణపట్నం గ్రామంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా మందు  తయారు చేసే కేంద్రాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు, వైద్యం చేయించుకున్న వారితో ఆయన మాట్లాడి వైద్యం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో వచ్చి కోలుకుని తిరిగి వెళ్లడం చూశామని ఈ సందర్భంగా గ్రామస్తులు సీపీఐ నారాయణకు ఫిర్యాదు చేశారు. మందుల పంపిణీని ఆపడం వల్ల ఎంతో మంది వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతుండడం బాధాకరమని.. ఆయన ఇచ్చే మందు కొండంత ధైర్యం కల్పిస్తుందని వారు పేర్కొన్నారు. 

ఈ సందర్బంగా సీపీఐ నేత నారాయణ మీడియాతో మాట్లాడుతూ మన పూర్వకులు అందించిన ప్రకృతి వైద్యం ఎంతో అద్భుతమైనదని అన్నారు. ప్రకృతి వైద్యం నుంచే అలోపతి వైద్యం తయారు అయిందని, ఆనందయ్య వనమూలికలతతో తయారు చేస్తున్న కరోనా మందు ఆయుర్వేదం కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు అని ఆయన పేర్కొన్నారు. ఎందరో శాస్త్రవేత్తలు, వైద్యులు కనుగొనలేనిది ఒక రైతు కనుగొని ప్రజల్లో కొండంత నమ్మకాన్ని కల్పించాడని, ఆనందయ్య మందులపై ప్రభుత్వం వెంటనే తీసుకున్న నిర్ణయం అభినందనీయమని సీపీఐ నేత నారాయణ ప్రశంసించారు. కార్పోరేట్ వైద్యం మెడికల్ మాఫియాలా తయారైందని, రాక్షసుల్లా డబ్బు పిండుకునే వైద్యులు ఆనందయ్య మందును జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

ఆనందయ్య మందుకు వ్యతిరేకంగా కార్పొరేట్ వైద్యం పోరాటం చేస్తున్నదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆనందయ్య 70 వేల మంది కి వైద్యం చేస్తే కేవలం ఒక్క వ్యక్తిని చూపించి తప్పు పట్టడం ఎంతమాత్రం సబబు  కాదని నారాయణ అన్నారు. ఐసీఎంఆర్, ఆయుష్ విభాగాలు త్వరతగతిన నివేదికలు సమర్పించి  ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సీపీఐ నేత నారాయణ కోరారు. ఆనందయ్యకు ప్రాణహాని కనిపిస్తున్న నేపధ్యంలో ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెంటనే స్పందించి ఆనందయ్య మందుపై స్పష్టత కల్పించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు. వంట ఇంటి సరుకులతో ప్రకృతి వైద్యం అందిస్తున్న ఆనందయ్య  వైద్యం వెంటనే అందుబాటులోకి తీసుకు రావాలని, మందుల పంపిణీని వెంటనే ప్రారంభించాలని నారాయణ సూచించారు.