సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు. ఇటీవలే ఉర్విల్ పటేల్ 31 బంతుల్లోనే సెంచరీ చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో యువ ఆటగాడు 18 ఏళ్ళ ఆయుష్ మాత్రే శతకం బాది అదరహో అనిపించాడు. శుక్రవారం (నవంబర్ 28) లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో విదర్భతో జరిగిన మ్యాచ్ లో 53 బంతుల్లో అజేయంగా 110 పరుగులు చేసి ముంబై జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. మాత్రే ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండడం విశేషం. ముంబై జట్టులో స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఈ యంగ్ టాలెంటెడ్ మాత్రం తన బ్యాటింగ్ తో ప్రధాన ఆకర్షణగా మారాడు.
ఐపీఎల్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆయుష్ మాత్రే చేరాడు. సీజన్ మధ్యలో కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో మాత్రేను చెన్నై తీసుకుంది. తొలి సీజన లో ఈ ముంబై బ్యాటర్ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్ గా ఆడిన ఈ చిచ్చర పిడుగు 7 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 190 స్ట్రైక్ రేట్‌తో 240 పరుగులు చేయడం విశేషం. 2026 ఐపీఎల్ సీజన్ లో మాత్రేను చెన్నై రిటైన్ చేసుకుంది. చెన్నై మాత్రను భవిష్యత్ సూపర్ స్టార్ గా భావిస్తోంది. ఆసియా కప్ అండర్-19లో ఇండియాకు కెప్టెన్ గా ఎంపికైన కొన్ని గంటలకే మాత్రే తన బ్యాటింగ్ తో మోత మోగించాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటిగ్ చేసిన విదర్భ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ తైడే (64), అమన్ మొఖడే (61) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన వారు విఫలం కావడంతో విదర్భ రెండు వందల మార్క్ చేరుకోలేకపోయింది. లక్ష్య ఛేదనలో మాత్రే సెంచరీతో ముంబై 17.5 ఓవర్లలో అలవోకగా విజయం సాధించింది. అజింక్య రహానె (0), హార్దిక్ తమోర్ (1) త్వరగానే ఔటయ్యారు. ఈ దశలో మాత్రే సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 35), శివం దూబే (19 బంతుల్లో 39*) లతో కలిసి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు.
