నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇండియా యంగ్ షట్లర్ ఆయుష్ శెట్టి అద్భుత పోరాటం సిల్వర్ మెడల్‌తో ముగిసింది. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఆయుష్ 8–21, 10–21తో వరల్డ్ రెండో ర్యాంకర్ షి యు కీ (చైనా) చేతిలో ఓడాడు. దాంతో ఈ టోర్నీలో ఇండియాను 61 ఏండ్లుగా ఊరిస్తున్న సింగిల్స్ స్వర్ణ కల ఈసారి కూడా నెరవేరలేదు. టోర్నీ ఆద్యంతం తిరుగులేని పెర్ఫామెన్స్‌తో టాప్ ప్లేయర్లను ఓడించిన ఆయుష్.. 42 నిమిషాల పాటు జరిగిన టైటిల్ ఫైట్‌లో మాత్రం పూర్తిగా తడబడ్డాడు.
స్టార్టింగ్ నుంచే నెట్ వద్ద పట్టు సాధించిన చైనీస్ ప్లేయర్ మెరుగైన డ్రాప్స్‌తో ఆయుష్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. పాయింట్లు రాబట్టే క్రమంలో ఆయుష్ వరుస తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేక వరుసగా రెండు గేమ్స్ కోల్పోయాడు. అయినా1965లో గోల్డ్ నెగ్గిన దినేశ్ ఖన్నా తర్వాత ఈ మెగా టోర్నీలో ఫైనల్ ఆడిన రెండో ఇండియన్‌గా ఆయుష్ రికార్డుకెక్కాడు.
