రాష్ట్రంలో ఎట్టకేలకు ఆయుష్మాన్​ భారత్​.. రూ. 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్

రాష్ట్రంలో ఎట్టకేలకు ఆయుష్మాన్​ భారత్​.. రూ. 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్
  • రాష్ట్రంలో ఎట్టకేలకు ఆయుష్మాన్​ భారత్​
  • అమలుకు అంగీకరించిన సీఎం కేసీఆర్​
  • 5 నెలల కిందనే స్కీంలో చేరుతామని ప్రకటన
  • 2018లోనే  స్కీం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
  • ఇప్పటికే అమలు చేస్తున్న 24 రాష్ట్రాలు 
  • ఇక ప్రైవేటులో ఫ్రీగా కరోనా ట్రీట్‌మెంట్

హైదరాబాద్, వెలుగు:  మూడేండ్ల కింద కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌‌ను రాష్ట్రంలో అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలు కూడా సిద్ధమయ్యాయన్నారు. ఇందుకు సంబంధించి నేషనల్ హెల్త్ అథారిటీతో స్టేట్ హెల్త్ డిపార్ట్‌‌ మెంట్‌‌ ఎంవోయూ కుదుర్చుకుందని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పథకాన్ని వెంటనే అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఆయుష్మాన్ భారత్‌‌ అమలు చేస్తామని గతేడాది డిసెంబర్‌‌‌‌ 30న రాష్ట్ర సర్కారు ప్రకటించినా ఇప్పటికీ అమలు చేయలేదు. ప్రతిపక్షాలు, ప్రజల ఒత్తిడితో తాజాగా మరోసారి ప్రకటన రిలీజ్ చేసింది. పథకం అమలుతో రాష్ట్రంలోని 26.11 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఈ కుటుంబాల్లో ఎవరికి కరోనా సోకినా ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌‌లో ఫ్రీగా ట్రీట్‌‌మెంట్ పొందొచ్చు. కరోనా టెస్టులను కూడా ఫ్రీగా చేయించుకోవచ్చు. 

ఆరోగ్యశ్రీకి, ఆయుష్మాన్ భారత్‌‌‌‌కు తేడాలున్నా ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో పేదలకు క్యాష్‌‌‌‌లెస్ ట్రీట్‌‌‌‌మెంట్ అందించడమే రెండింటి ప్రధాన ఉద్దేశం. ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌‌మెంట్‌‌ అందిస్తే ఆయుష్మాన్‌‌‌‌లో రూ. 5 లక్షల వరకు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీలో 972 రకాల ట్రీట్‌‌‌‌మెంట్ ప్రొసీజర్స్ కవర్ అవుతుండగా ఆయుష్మాన్‌‌‌‌లో 1,350 ఉన్నాయి. ఆయుష్మాన్‌‌‌‌లో లేని 540 ప్రొసీజర్స్‌‌‌‌ ఆరోగ్యశ్రీలో ఉండగా ఆరోగ్యశ్రీలో లేనివి ఆయుష్మాన్‌‌‌‌లో 685 ఉన్నాయి. ఉదాహరణకు డెంగీ, మలేరియా వంటి వాటికి ఆరోగ్యశ్రీ వర్తించదు కానీ ఆయుష్మాన్ వర్తిస్తుంది. కిడ్నీ, లివర్ మార్పిడులు ఆరోగ్యశ్రీలో ఉండగా ఆయుష్మాన్‌‌‌‌లో లేవు. రెండిట్లో కామన్‌‌‌‌గా 430 ప్రొసీజర్లు ఉన్నాయి. రెండింటినీ కలిపి అమలు చేస్తే రాష్ర్ట ప్రజలకు 1,887 రకాల ట్రీట్‌‌మెంట్స్‌‌ ప్రైవేటు హాస్పిటల్స్‌‌లో ఫ్రీగా లభిస్తాయి.

దేశంలో ఎక్కడైనా ట్రీట్‌‌మెంట్‌‌
తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తుండగా సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్‌‌ ఆధారంగా ఆయుష్మాన్‌‌‌‌ లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో రాష్ర్టంలోని 26.11 లక్షల కుటుంబాలు కవర్ అవుతున్నాయి. ప్రతి కుటుంబం ఏడాదికి రూ. 5 లక్షల వరకూ ప్రైవేట్‌‌, కార్పొరేట్ హాస్పిటల్స్‌‌లో ఫ్రీగా ట్రీట్‌‌మెంట్ తీసుకోవచ్చు. ఈ లెక్కన 26.11 లక్షల కుటుంబాల కోసం ఏడాదికి సుమారు రూ.300 కోట్ల వరకూ కేంద్రం భరించనుంది. రాష్ర్ట ప్రభుత్వంపై కొంత ఆర్థిక భారం తగ్గుతుంది. దేశంలో ఎక్కడైనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకునే వెసులుబాటు ఉంది. 

బెనిఫిట్స్​ ఇవీ

  • సోషియో ఎకనమిక్‌ సర్వేలో ఉన్న ఫ్యామిలీలకు వర్తింపు
  • కుటుంబానికి రూ. 5 లక్షల వరకు హెల్త్‌ కవర్‌
  • ఆడ పిల్లలు, మహిళలు, వృద్ధులకు ప్రయార్టీ
  • 1350 రకాల ట్రీట్​మెంట్స్​ ఇందులో కవరైతయ్‌
  • ప్రాసెస్‌ అంతా పేపర్​లెస్‌, క్యాష్​లెస్‌గా జరుగుతుంది 
  • సపోర్ట్‌, కో ఆర్డినేట్‌ చేసేందుకు ఆరోగ్య మిత్రలు ఉంటారు
  • దేశంలో ఎక్కడైనా ట్రీట్‌మెంట్‌ చేయించుకోవచ్చు

ఎట్ల అమలు చేస్తరు?
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎంపానల్‌మెంట్ ఉన్న హాస్పిటల్స్‌ 337 ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్‌ ఎంపానల్‌మెంట్ ఉన్నవి 12 ఉన్నాయి. ఇందులో 2 వరంగల్‌లో, 10 హైదరాబాద్‌లో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టెంపరరీగా ఆరోగ్యశ్రీ ఎంపానల్‌మెంట్ ఉన్న అన్ని హాస్పిటళ్లకూ ఆయుష్మాన్ ఎంపానల్‌మెంట్ ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. లబ్ధిదారుల వివరాలు ఆయుష్మాన్ భారత్ పోర్టల్​లో ఎంటర్ చేసి ఉన్నాయి. ఇందులో దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆయుష్మాన్ హెల్త్ కార్డు వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకుని ఎంపానల్‌మెంట్ ఉన్న హాస్పిటల్‌లో ఫ్రీగా ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. లబ్ధిదారుల లిస్టులో పేరు ఉందో లేదో వెబ్‌సైట్‌ (https://mera.pmjay.gov.in/search/login) లో చెక్ చేసుకోవచ్చు.