ఆయుష్మాన్ అమల్లోకి తెచ్చేదెన్నడు?

ఆయుష్మాన్ అమల్లోకి తెచ్చేదెన్నడు?
  • కరోనాకు ఫ్రీ ట్రీట్‌మెంట్‌పై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రజలు
  • ఆయుష్మాన్‌లో చేరుతున్నట్టు డిసెంబర్ 30న సీఎస్ ప్రకటన
  • 6 రోజుల కింద చెప్పిన సీఎం.. ఇప్పటికీ అమలుకు చర్యల్లేవ్
  • వెంటనే చేరుంటే  వేలాది మందికి బిల్లుల భారం తప్పేది

హైదరాబాద్, వెలుగు: ఆయుష్మాన్ భారత్ పథకం అమలు విషయంలో రాష్ర్ట సర్కార్ అడుగులు ముందుకు పడటం లేదు. ఆయుష్మాన్‌‌లో చేరుతున్నట్టు గత డిసెంబర్‌‌‌‌లోనే సీఎస్ సోమేశ్‌‌కుమార్ ప్రకటించారు. ఈ స్కీమ్ అమలుకు సంబంధించి విధివిధానాలన్నీ ఖరారు అయ్యాయని ఈ నెల 18న సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయుష్మాన్‌‌ కింద ప్రజలు చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌ను సీఎం ఆదేశించారు. ఎంపానల్డ్‌‌ హాస్పిటల్స్‌‌లో ఆయుష్మాన్ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలంటూ అదే రోజు హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇదంతా జరిగి వారం రోజులు కావొస్తోంది. కానీ హెల్త్ ఆఫీసర్లు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పటిదాకా ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ప్రభుత్వం నుంచి గానీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి గానీ సమాచారం ఇవ్వలేదు. ఆయుష్మాన్‌‌ భారత్ అమలు చేస్తున్నట్టు మీడియాలో చూడడమే తప్ప, తమతో అసలు చర్చించనే లేదని, కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ప్రైవేట్ హాస్పిటల్స్‌‌ అసోసియేషన్ ప్రెసిడెంట్, డాక్టర్ రాకేశ్ చెప్పారు.మన రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఆరోగ్యశ్రీ స్కీమ్‌‌తో కలిపి ఆయుష్మాన్ అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన గైడ్‌‌లైన్స్ సిద్ధమయ్యాయని కేసీఆర్ చెప్పడమే తప్ప వాటిని రిలీజ్ చేయలేదు. దీంతో ప్రజల దృష్టిని మరల్చడానికే సీఎం కేసీఆర్ ప్రకటన జారీ చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నయి.

జనాలు నిలదీస్తున్నరు

కరోనా ట్రీట్‌‌మెంట్‌‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడికి పోయినా ఆరోగ్యశ్రీలో ఎప్పుడు చేరుస్తారని అడుగుతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌‌‌‌ ట్విట్టర్‌‌లో నిర్వహించిన ‘ఆస్క్ కేటీఆర్‌‌’లోనూ కరోనాను ఆరోగ్యశ్రీలో ఎప్పుడు చేరుస్తారని వందల మంది ప్రశ్నించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల లీడర్లు సైతం ఇదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో ప్రభుత్వం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కేరళ, యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ జనాలే ట్రీట్‌‌మెంట్ ఖర్చు భరిస్తున్నారని, ఈ విషయం ఆఫీసర్ల స్టడీలో తేలిందని పేర్కొంది. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మహారాష్ట్రలో గతేడాది నుంచే కరోనాకు ఫ్రీ ట్రీట్‌‌మెంట్ ఉంది. ఆ రాష్ట్ర హెల్త్ ఇన్సూరెన్స్ (మన ఆరోగ్యశ్రీ లాంటిది) స్కీమ్ పరిధిలోకి కరోనాను గతంలోనే తీసుకొచ్చారు. తమిళనాడులో‌‌నూ ఇటీవల అక్కడి స్కీమ్‌‌లోకి కరోనాను తీసుకొచ్చారు. స్టాలిన్ సీఎం అయ్యాక ఫస్ట్ సంతకం ఫ్రీ ట్రీట్‌‌మెంట్ ఫైల్‌‌ పైన చేశారు. యూపీలో ఆయుష్మాన్ భారత్‌‌ అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద ఫస్ట్ వేవ్ నుంచే కరోనా‌‌కు ఉచితంగా ట్రీట్‌‌మెంట్ ఇస్తున్నారు‌‌‌‌‌‌‌‌‌‌. కేరళ ప్రభుత్వం పది‌‌ రోజుల క్రితమే ప్రైవేట్‌‌ హాస్పిటళ్లలో ఫీజులపై గతంలో ఇచ్చిన జీవోనూ సవరిస్తూ ఇంకో జీవో ఇచ్చింది. ఈసారి చార్జీలు మరింత తగ్గించింది. ఆయుష్మాన్ స్కీమ్‌‌ను కూడా అమలు చేస్తోంది. సర్కార్ ప్రకటన బెడిసి కొట్టడంతో, ఆయుష్మాన్ భారత్‌‌లో చేరుతున్నట్టు మరో ప్రకటన రిలీజ్ చేశారు. అమలు విషయంలో మాత్రం స్పష్టత లేదు.

ఆయుష్మాన్ పరిధిలో 26 లక్షల కుటుంబాలు 

ఆయుష్మాన్ భారత్ పథకం అమల్లోకి వస్తే కరోనా ట్రీట్‌‌మెంట్ ఉచితంగా లభిస్తుందని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. మన రాష్ర్టంలో 26.11 లక్షల కుటుంబాలు ఆయుష్మాన్‌‌ పరిధిలో ఉన్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌‌లో ఒక్కో కుటుంబం రూ.ఐదు లక్షల వరకూ ఉచితంగా ట్రీట్‌‌మెంట్ పొందొచ్చు. అయితే ఆయా హాస్పిటళ్లు ఆయుష్మాన్‌‌లో ఎంపానల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌ నుంచి గైడ్‌‌లైన్స్ రిలీజ్ అయితే, దాన్ని బట్టి ఎంపానల్‌‌మెంట్ చేసుకుంటామని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 337 హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ కింద ఎంపానల్ అయి ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 79 లక్షల కుటుంబాల్లో నుంచి, 26.11 లక్షల కుటుంబాలు ఆయుష్మాన్‌‌లోకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబ సభ్యులు ట్రీట్‌‌మెంట్ కోసం వచ్చినప్పుడు ఆయుష్మాన్ కింద చేయడమా? ఆరోగ్యశ్రీ కింద చేయడమా అనేది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. ఆయా కుటుంబాల ఆరోగ్యశ్రీ కార్డులు అలాగే కొనసాగిస్తారా? లేదా ఆయుష్మాన్ కార్డులు ఇచ్చి, ఆరోగ్యశ్రీ కార్డులు రద్దు చేస్తారా కూడా చెప్పాల్సి ఉంది. ఈ అంశాలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇవేవీ లేకుండానే ఆయుష్మాన్‌‌ అమలుపై సర్కార్ ప్రకటన రిలీజ్ చేసింది.