
వరంగల్ సిటీలోని పురాతన అజాంజాహీ బావి ఆనవాళ్లు కోల్పోతుంది. చెత్తా చెదారంతో నిండిపోతోంది. నిజాంకాలంలో నిర్మించిన బావి అజాంజాహీ మిల్లు కార్మికులు వేయి మంది ఉండే క్వార్టర్లకు నీరందించి దూప తీర్చింది. అప్పట్లో బావిని రాతి కట్టడంతో నిర్మించారు. దాదాపు రెండు తాటిచెట్ల లోతు ఉండి.. పంప్‌ల ద్వారా నీటిని అందించింది. ఇప్పటికీ భవిష్యత్ తరాల తాగునీటి అవసరాలను తీర్చేలా ఉంది.
కాగా.. బావి కాస్త చెత్తాచెదారంతో పూడ్చుతుండడంతో పాటు కూల్చేస్తున్నారు. దీంతో పురాతన బావిపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇదిలానే కొనసాగితే త్వరలోనే చారిత్రక బావి కనుమరుగయ్యే ముప్పు పొంచి ఉంది. వరంగల్కలెక్టరేట్కు కూడా నీటిని సరఫరా చేసేలా బావి ఉంది. ఆ దిశగా అధికారులు ఆలోచన చేసి పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాటి అజాంజాహీ మిల్లు కార్మికుడు మార్కండేయ బావితో తన అనుబంధాన్ని గుర్తు చేశాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బావి పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కోరాడు.