
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ, ఆ స్థాయి కోర్సులు చదువుతున్న 15 వేల మంది యువతులకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందించడం అభినందనీయమని రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీహెచ్‌సీఈ) చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఒక్కొక్క విద్యార్థినికి ప్రతి ఏటా రూ.30 వేలు చొప్పున అందించనున్నారని, బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం గొప్ప అడుగుగా ఉందని అభిప్రాయపడ్డారు. అర్హులైన బాలికలు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన టీహెచ్‌సీఈ కార్యాలయంలో ఫౌండేషన్ తెలంగాణ ఇన్‌చార్జీలు శ్రీనివాస్, కృష్ణస్వామి, కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తదితరులతో కలిసి స్కాలర్‌షిప్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. సర్కారు విద్యాసంస్థల్లో 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన బాలికలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులని తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ తదితర కోర్సుల్లో మొదటి సంవత్సరంలో చేరిన వారు అర్హులన్నారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్ https://azimpremjifoundation.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన బాలికలకు కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏటా రూ.30 వేలు అందజేస్తారు. 15 వేల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ విధానంతో ఎంపిక చేస్తారని, దీనికి ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదని వివరించారు.