ప్రతి రోజూ 22 కోట్లు చొప్పున విరాళమిచ్చిన అజీమ్ ప్రేమ్ జీ

ప్రతి రోజూ 22 కోట్లు చొప్పున విరాళమిచ్చిన అజీమ్ ప్రేమ్ జీ

ఏడాదికి 7 వేల 904 కోట్లు దానం

విరాళాలివ్వడంలో టాప్ ప్లేస్ లో అజీం ప్రేమ్ జీ

ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా – 2020 జాబితా విడుదల

మూడో ప్లేస్ లో ముఖేష్ అంబానీ

ముంబై: ధనవంతులకు డబ్బు సంపాదించడమే తప్ప దానం ఇవ్వడం తెలియదనుకోవడం చాలా పొరపాటు. మన భారతీయ పారిశ్రామిక వేత్తలు ధాతృత్వ కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగిస్తూ పోటీపడుతున్నారు. కరోనా మహమ్మారిపై పోరు కోసం కార్పొరేట్‌ రంగం భారీగా విరాళాలిచ్చింది. భారతీయ సాఫ్ట్‌వేర్ సంస్థ విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ గత ఏడాదిలో ప్రతి రోజూ 22 కోట్ల రూపాయల చొప్పున విరాళాలు ఇచ్చి దాతృత్వంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2020వ సంవత్సరంలో చేతిలో ఎముక లేకుండా అన్నట్లు విరివిగా దానాలు చేసి అగ్రస్థానంలో నిలిచారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్తల విరాళాల వివరాలను ఎడెల్ గైవ్ హరున్ ఇండియా సంస్థ సేకరించి ఏటా జాబితా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. హరూన్ ఇండియా విడుదల చేసిన ఈ ఏడాది జాబితాలో అజీమ్ ప్రేమ్ జీ టాప్ ప్లేస్ లో నిలిచారు. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో ఇచ్చిన విరాళాల ఆధారంగా  హురున్ రిపోర్ట్ ఇండియా జాబితా విడుదల చేసింది. తాజా లెక్కల ప్రకారం రోజుకు 22కోట్లు చొప్పున ఏడాదికి  7,904 కోట్లు విరాళంగా ఇచ్చారు ప్రేమ్ జీ. హెచ్ సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివనాడార్ ఫ్యామిలీ 795 కోట్లు విరాళంగా ఇచ్చి రెండో స్థానంలో నిలువగా..  458 కోట్లతో ముఖేష్ అంబానీ మూడో స్థానంలో.. 276 కోట్లతో కుమార మంగళం బిర్లా ఫ్యామిలీ నాలుగో స్థానంలో నిలిచింది.

10 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన వ్యక్తుల సంఖ్య అంతకు ముందు కాలం 72 నుండి 78 కు స్వల్పంగా పెరిగిందని నివేదిక తెలిపింది. 27 కోట్ల విరాళంతో,  ఏటీఈ చంద్ర ఫౌండేషన్‌కు చెందిన అమిత్ చంద్ర, అర్చన చంద్ర ఈ జాబితాలో ప్రవేశించిన తొలి, ఏకైక ప్రొఫెషనల్ మేనేజర్లుగా నిలిచారు.

ఈ జాబితాలో  ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ముగ్గురికి చోటు దక్కింది. నందన్‌ నీలేకని 159 కోట్లు,  ఎస్ గోపాల​ కృష్ణన్ 50 కోట్లు, షిబులాల్ 32 కోట్లు చొప్పున విరాళిచ్చారు. అలాగే 5 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన 109 మంది వ్యక్తుల జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరిలో రోహిణి నీలేకని  47 కోట్ల రూపాయలతో అగ్రస్థానంలో ఉన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ (37) 5.3 కోట్లతో అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు.