హిందూస్థాన్ యూనీలీవర్ నుంచి విడిపోయిన ఐస్‌క్రీమ్ దిగ్గజం 'క్వాలిటీ వాల్స్ ఇండియా' ఐపీఓ షేర్ల లిస్టింగ్ ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది. ఫిబ్రవరి 16, 2026న స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ కంపెనీ షేర్లు ఊహించిన దానికంటే తక్కువ ధరకే లిస్ట్ అయ్యాయి.
మార్కెట్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ.. క్వాలిటీ వాల్స్ షేర్లు సోమవారంNSEలో రూ.29.80 వద్ద లిస్ట్ అయ్యాయి. డీమెర్జర్ తర్వాత నిర్ణయించిన ఇండికేటివ్ ధర రూ.40.20తో పోలిస్తే ఇది దాదాపు 25.87 శాతం డిస్కౌంటెడ్ ఎంట్రీ. అటు BSEలో కూడా కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.29.90 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశకు గురిచేసింది. లిస్టింగ్ సమయంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.7వేల 2 కోట్లుగా నమోదైంది.
డీమెర్జర్ నుంచి లిస్టింగ్ వరకు.. ఏం జరిగింది?
అక్టోబర్ 30, 2025న NCLT అనుమతి లభించిన తర్వాత.. డిసెంబర్ 5ను రికార్డు తేదీగా నిర్ణయించారు. HUL షేర్ హోల్డర్లకు 1:1 నిష్పత్తిలో అంటే ప్రతి ఒక్క HUL షేరుకు ఒక క్వాలిటీ వాల్స్ షేరు కేటాయింపులు జరిగాయి. ఆ సమయంలో NSE ఈ స్టాక్‌ను తాత్కాలికంగా 'DUMMYHDLVR' పేరుతో నిఫ్టీ 50 సహా 35 ఇండెక్స్‌లలో చేర్చింది. అయితే నేడు అధికారికంగా లిస్ట్ అయినప్పుడు అమ్మకాల ఒత్తిడికి ఐస్ క్రీమ్ కంపెనీ షేర్లు గురయ్యాయి.
నిరాశకు కారణాలేంటంటే..?
ముఖ్యంగా HUL ఇటీవలి త్రైమాసిక ఫలితాల్లో లాభం 15% పడిపోవడం, మార్జిన్ల తగ్గింపు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. ఐస్‌క్రీమ్ వ్యాపారం HUL ఆదాయంలో కేవలం 3% మాత్రమే వాటా కలిగి ఉండటం.. ఈ రంగంలో ఉన్న తీవ్రమైన పోటీ వల్ల ఇండిపెండెంట్ కంపెనీగా దీని వృద్ధిపై ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.
బ్రోకరేజ్ సంస్థల మాట ఇదే..
లిస్టింగ్ తర్వాత కూడా ప్రముఖ విదేశీ బ్రోకరేజ్ సంస్థలు క్వాలిటీ వాల్స్ షేర్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి.
* HSBC: 'Hold' రేటింగ్ అందించింది.
* Morgan Stanley: మార్జిన్లు స్థిరంగా ఉన్నా.. ఆదాయ వృద్ధిపై స్పష్టత లేదని పేర్కొంటూ 'Equal-weight' రేటింగ్ ఇచ్చింది.
మొత్తానికి ఒక పెద్ద బ్రాండ్ విడిపోయి విడిగా మార్కెట్లోకి వచ్చినప్పుడు ఉండే జోష్.. క్వాలిటీ వాల్స్ విషయంలో డిస్కౌంట్ లిస్టింగ్‌తో ఆవిరైపోయింది. అయితే ఇండిపెండెంట్ కంపెనీగా భవిష్యత్తులో ఈ ఐస్‌క్రీమ్ వ్యాపారం ఏ మేరకు రాణిస్తుందో త్రైమాసిక ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.
