- బుజ్జగింపులు, బెదిరింపులకు లొంగని ఆశావహులు
- ఫిరాయింపుల భయంతో ముందస్తు జాగ్రత్తలు, విత్‌డ్రాలపై నేతల్లో టెన్షన్
- నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ, మజ్లిస్ అభ్యర్థుల పేర్లు మాత్రమే క్లియర్
నిజామాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు ప్రధాన పార్టీల నేతలు జంకుతున్నారు. పోటీ అధికంగా ఉండటం, బుజ్జగింపులు, -బెదిరింపులకు ఆశావహులు లొంగకపోవడం నేతలకు తలనొప్పిగా మారింది. ఎవరి పేరు ప్రకటిస్తే ఎక్కడ ఫిరాయింపులు జరుగుతాయోనన్న భయంతో ఎప్పుడూ లేనంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మాత్రమే బీజేపీ, మజ్లిస్ పార్టీలు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించాయి.
సర్దుబాటు పూర్తైన కొన్ని స్థానాలకు కాంగ్రెస్ సలహాదారు సుదర్శన్‌రెడ్డి సోమవారం బీఫారాలు అందజేయగా, మిగిలిన వాటిని మంగళవారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలలో బీజేపీ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మంగళవారం నేరుగా అభ్యర్థుల చేతికే బీఫారాలు ఇవ్వనున్నట్లు సమాచారం. బోధన్‌లో మజ్లిస్ పార్టీ కూడా ఇదే ప్లాన్‌తో ముందుకెళ్తోంది. నామినేషన్లు వేసిన ఆశావహుల్లో టెన్షన్ నెలకొనగా, సాయంత్రం జరగనున్న విత్‌డ్రాలపై పార్టీ నేతల్లో టెన్షన్పెరుగుతోంది.
అన్ని చోట్లా అదే డిమాండ్..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు 319 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతి డివిజన్‌కు ఐదుకు పైగా నామినేషన్లు పడ్డాయి. బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులకుగాను 81 నామినేషన్లు, ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులకుగాను 72 నామినేషన్లు, భీంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులకుగాను 39 నామినేషన్లు వేశారు. మంగళవారం రిటర్నింగ్ ఆఫీసర్లకు బీఫారాలు అందజేసే వారే ఆయా పార్టీల అధికారిక అభ్యర్థులుగా ఖరారు కానున్నారు.
సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసిన పార్టీ నేతలు, మిగతా వారిని విత్‌డ్రా చేయించేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా చాలామంది ఒప్పుకోవడం లేదు. దీంతో పేర్లు ప్రకటించకుండా నేరుగా బీఫారాలు చేతికే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నగర పాలక సంస్థ పరిధిలో పోటీ చేస్తున్న 50 మంది బీజేపీ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్కులాచారి రెండు దఫాల్లో ప్రకటించారు.
బోధన్, ఆర్మూర్, భీంగల్ వార్డుల్లో టికెట్ రేస్‌లో ఉన్న ఆశావహులు ఇద్దరు, ముగ్గురు చొప్పున నామినేషన్లు వేసి పోటీపడుతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించినా వెనక్కి తగ్గడం లేదని సమాచారం. ఫిరాయింపుదారుల కోసం బీఆర్‌ఎస్ కాపుకాస్తుండటంతో పార్టీలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఖరారు అయిన అభ్యర్థులకు గంట ముందు బీఫారాలు అందజేసి, నేరుగా ఆర్వో కార్యాలయాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
నిజామాబాద్‌లో అభ్యర్థులను ప్రకటించిన మజ్లిస్ పార్టీ కూడా బోధన్‌లో నెలకొన్న బీఫారాల డిమాండ్ నేపథ్యంలో గోప్యత పాటిస్తోంది. ఇదిలా ఉండగా, బీఆర్‌ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులకు బీఫారాలు అందజేయగా, ఆ పార్టీని చిత్తు చేయాలనే వ్యూహంతో జాగృతి చీఫ్ కవిత ఫార్వర్డ్ బ్లాక్ ‘సింహం’ గుర్తుతో పోటీ చేసే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
