అసెంబ్లీలో సీఎం నితీశ్​ను నిలదీసిన బీజేపీ

అసెంబ్లీలో సీఎం నితీశ్​ను నిలదీసిన బీజేపీ
  • బిహార్​లోని సరన్ జిల్లా చాప్రాలో ఘటన
  • తాగి వచ్చారా? అంటూ నితీశ్ కుమార్​ ఫైర్

పాట్నా: బీహార్​లో విషాదం చోటు చేసుకుంది. సరన్​ జిల్లా చాప్రాలోని 2 గ్రామాల్లో కల్తీ లిక్కర్ తాగి 24 మంది చనిపోయారు. మంగళవారం రాత్రి ఆరుగురు చనిపోగా.. బుధవారం నాటికి మృతుల సంఖ్య 24కి పెరిగింది. మరికొందరి పరిస్థితి క్రిటికల్​గా ఉంది. వారిని ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించి ట్రీట్​మెంట్ ఇస్తున్నారు. కల్తీ మద్యం కారణంగానే తమ వాళ్లు చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంగళవారం లిక్కర్​ తాగి ఇంటికెళ్తున్న టైంలోనే ఇలా జరిగిందని చెప్తున్నారు. ఈ రెండు ఘటనలు ఇస్వాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోయిలా, మష్రక్ పీఎస్​ పరిధిలోని యదు మోర్‌‌ గ్రామాల్లో జరిగాయి. పోలీసులు డెడ్​బాడీలను  పోస్టుమార్టానికి తరలించారు. అనుమానాస్పద మరణాల కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు రాగానే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. బీహార్‌‌లో మద్య నిషేధం అమల్లో ఉంది. అయితే, కల్తీ మద్యం మాత్రం విచ్చలవిడిగా లభిస్తున్నదనే ఆరోపణలున్నాయి.

మరణాలపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ

కల్తీ మద్యం ఘటన అసెంబ్లీని కుదిపేసింది. మరణాలపై ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం నితీశ్​ కుమార్​ను నిలదీశారు. 2016 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మద్య నిషేధం ఉన్నప్పటికీ.. మరణాలు సంభవిస్తూనే ఉన్నాయని, దీనికి నితీశ్ సర్కారే కారణమని విమర్శించారు. చాప్రాలోని రెండు గ్రామాల్లో 24 మంది చనిపోయారని ఆరోపించారు. ఇంకా చాలా మంది చావు బతుకుల్లో ఉన్నారంటూ నితీశ్​పై బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

మీరంతా తాగుబోతులు : నితీశ్​

అప్పటి దాకా ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేల నిరసనలు చూస్తూ కూర్చున్న నితీశ్ కుమార్.. అసహనం కోల్పోయి ఒక్కసారిగా వారిపై మండిపడ్డారు. ‘‘మీరంతా తాగుబోతులు.. అసెంబ్లీకి తాగి వచ్చారా? సభలో అసలు ఏం జరుగుతోంది? ఏం మాట్లాడ్తున్నరు? అరవకండి. మీరు చేస్తున్నది కరెక్ట్​ కాదు. దీన్ని ఏమాత్రం సహించేది లేదు. మద్య నిషేధం బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అంతా మద్దతిచ్చారు కదా..  మరి ఇప్పుడు ఇలా రివర్స్‌‌లో మాట్లాడటమేంటి? ఎందుకిలా మాట్లాడ్తున్నారు? చెత్త రాజకీయాలు చేయకండి. ఇక్కడి నుంచి బయటికి పొండి’’ అని బీజేపీ ఎమ్మెల్యేలనుద్దేశించి నితీశ్ ఫైర్ అయ్యారు. ఈ కామెంట్లతో అసెంబ్లీలో కొంత సేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

నితీశ్​ పనైపోయింది : బీజేపీ

నితీశ్ కుమార్ కామెంట్లను ఖండిస్తూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు.  నితీశ్​ టైం అయిపోయిందని, ఆయన తన జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారని, ఈ మధ్య తరచూ కోపం తెచ్చుకుంటున్నారని తెచ్చుకుంటున్నారు బీజేపీ ఎంపీ సుశీల్​ కుమార్​ విమర్శించారు. మద్యం నిషేధానికి తాము సపోర్ట్​ చేశామని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బిల్లుకి మద్దతు ఇచ్చామని, కానీ, చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ డిప్యూటీ సీఎం తారా కిశోర్​ ప్రసాద్ విమర్శించారు.