న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనేపూడి నిర్మించారు. ఉపేంద్ర లిమాయే, టిను ఆనంద్, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, మాల్వీ మల్హోత్రా, సమృద్ధి ఆర్యాళ్, కార్తికేయ, విస్మయశ్రీ, శుభలేఖ సుధాకర్, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబర్ 9న విడుదలవుతోంది.
శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో ఉపేంద్ర లిమాయె మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. నా పాత్ర కంటే కథకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. తెలుగులో ఇది నా మొదటి పూర్తి స్థాయి పాత్ర. అందుకే ఈ మూవీ నా హార్ట్‌కి ఎంతో దగ్గరైంది. ప్రేక్షకులు కూడా సినిమాను ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. దర్శకుడు గుణి మంచికంటి మాట్లాడుతూ ‘ఇది రొటీన్ హీరో, హీరోయిన్, విలన్ తరహా సినిమా కాదు. ఇందులో కనిపించే ప్రతి పాత్ర ఎంతో కీలకం. మేఘాలయ లాంటి సవాలుతో కూడిన లొకేషన్లలో తక్కువ సమయంలో పూర్తి చేయగలిగామంటే దానికి నటీనటులందరి సహకారమే కారణం. కుటుంబ సమేతంగా వెళ్లి చూసి ఆనందించదగ్గ చక్కని క్లీన్ సినిమా ఇది’ అని చెప్పాడు. పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉందని నిర్మాత వేణు దోనేపూడి అన్నారు. టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
