బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్‌‌ యానిమేషన్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌‌లో స్ట్రీమింగ్

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్‌‌ యానిమేషన్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌‌లో స్ట్రీమింగ్

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’  ఇప్పుడు  మరో ప్రాజెక్ట్‌‌గా రాబోతోంది. అయితే ఇది సినిమా కాదు.. యానిమేషన్ సిరీస్. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్‌‌’ పేరుతో తెరకెక్కించారు. ఈ సిరీస్‌‌ను గ్రాఫిక్ ఇండియా, ఆర్కా మీడియావర్క్స్,  రాజమౌళి, శరద్ దేవరాజన్, శోభు యార్లగడ్డ నిర్మించారు. జీవన్ జే కాంగ్,  నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. ఇది మే 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో రాజమౌళి మాట్లాడుతూ ‘‘బాహుబలి’ ఫ్రాంచైజీకి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది.

‘క్రౌన్ ఆఫ్ బ్లడ్’తో బాహుబలి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించడం అద్భుతంగా అనిపిస్తుంది. బాహుబలి కోసం క్యారెక్టర్ ఆర్క్స్, ప్రీ స్టోరీ, పోస్ట్ స్టోరీ రాసినప్పుడు ఈ యూనివర్స్‌‌లో ప్రేక్షకులకు చెప్పడానికి ఇంకా కథ ఉంది అనిపించింది. యానిమేషన్‌‌లో  శరద్ విజన్ నాకు చాలా నచ్చింది. ప్రేక్షకులని కచ్చితంగా అలరించనుంది’ అని అన్నారు.  యానిమేటెడ్ విజువల్స్ పిల్లలనే కాకుండా పెద్దలకూ నచ్చేలా రూపొందించామని సిరీస్ క్రియేటర్ శరద్ దేవరాజన్ చెప్పారు. నిర్మాత శోభు యార్లగడ్డ,  డిస్నీ ప్లస్ హాట్‌‌స్టార్ కంటెంట్ హెడ్ గౌరవ్ బెనర్జీ, నటుడు శరద్ కేల్కర్ పాల్గొన్నారు.