ట్విట్టర్ టిల్లు ఇప్పటికైనా మారు.. కేటీఆర్పై బాబా ఫసియుద్దీన్ ఫైర్

ట్విట్టర్ టిల్లు ఇప్పటికైనా మారు.. కేటీఆర్పై బాబా ఫసియుద్దీన్ ఫైర్
  • కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక బీఆర్ఎస్​ ఓ ప్రైవేట్ కంపెనీ అయింది: ఫసియుద్దీన్
  • బల్దియాపై మూడు రంగుల జెండా ఎగరవేస్తమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ట్విట్టర్ టిల్లు భాయ్ ఇప్పటికైనా మారాలని.. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే ప్రజలు ఊరుకోరని కేటీఆర్ ను ఉద్దేశించి మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన ఆయన కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి, రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి ప్రొటోకాల్, పెండింగ్ పనులపై శనివారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో కమిషనర్​కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, బల్దియాపై మూడు రంగుల జెండా ఎగరవేస్తామని చెప్పారు.

బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదని, అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కార్పొరేటర్లుగా ఉన్న ఉద్యమకారులకు పదవులిస్తామని చెప్పి.. బీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు. తాను ఉద్యమంలో ఉన్న టైమ్‌లో కేటీఆర్ ఫారిన్​లో ఉండేవారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ఎవరిని పట్టించుకోలేదని, కలిసేందుకు ఇంటికో, ఆఫీసుకో వెళ్తే.. ఇక్కడకు ఎందుకొచ్చారని మండిపడే వారన్నారు. పార్టీ కోసం తాను ఎంత కష్టపడింది తెలంగాణ భవన్ ప్రతి ఇటుక చెప్తుందన్నారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ ఓ ప్రైవేట్ కంపెనీలా మారిందని ఆరోపించారు. అధికారం పోయాక ఇప్పుడు కేటీఆర్​కు కార్పొరేటర్లు గుర్తుకొచ్చారని విమర్శించారు.

సీటీలో ఉన్న భూములు, ఆస్తులు కాపాడుకునేందుకు ఇప్పుడు కార్పొరేటర్లతో మంచిగ మాట్లాడుతున్నట్టు నటిస్తున్నడని చెప్పారు. ఎమ్మెల్యే మాగంటి  గోపీనాథ్ తన హత్యకు కుట్ర పన్నుతున్నాడని, సుపారీ ఇచ్చాడని.. కేటీఆర్, కేసీఆర్​కు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చుతామని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే బీఆర్ఎస్​ను ప్రజలే కాలగర్భంలో కలిపేస్తారని హెచ్చరించారు.