మంత్రాల పేరుతో మోసం.. అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యం

మంత్రాల పేరుతో మోసం.. అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యం

హైదరాబాద్,వెలుగు: మంత్రాలతో తల్లి ఆరోగ్యం బాగు చేస్తానని నమ్మించి అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డ భూత వైద్యుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. చంచల్​గూడకి చెందిన సయ్యద్ హసన్​ అస్కరి(52) చెప్పుల వ్యాపారి. కొన్నేండ్లుగా  భూత వైద్యం పేరుతో హసన్ జనాలను మోసం చేస్తున్నాడు. అతడి కొడుకు సయ్యద్ అఫ్రోజ్(23) తండ్రికి సాయం చేసేవాడు. 2005లో కిషన్​బాగ్​కు చెందిన మహిళకు  ఆరోగ్యం క్షీణించడంతో ఆమె సోదరుడు హసన్ దగ్గరికి తీసుకొచ్చాడు. వైద్యం పేరుతో హసన్  ఆమె కుటుంబానికి దగ్గరయ్యాడు. హసన్ వైద్యంతో తన తల్లికి నయమవుతోందని మహిళ పెద్ద కుమార్తె(32), చిన్న కుమార్తె(23) నమ్మారు. తరచూ వారి ఇంటికి వచ్చి వెళ్తున్న హసన్ పెద్ద కుమార్తెను ట్రాప్ చేయబోయాడు.

కానీ ఆమెకు 2015లో పెళ్లవడంతో భార్యభర్తలను ఎలాగైనా విడగొట్టాలని స్కెచ్ వేశాడు.  మాయమాటలు చెప్పి 2016లో ఆమెతో భర్తకు విడాకులు ఇప్పించాడు. కిషన్​బాగ్​లో మహిళ కుటుంబానికి ఉన్న ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బులను సైతం హసన్ వాడుకున్నాడు.  అక్కాచెల్లెళ్లను కిషన్​బాగ్ నుంచి బండ్లగూడ తులసీనగర్​లోని అద్దె ఇంటికి మకాం మార్పించాడు. అప్పటి నుంచి మాయమాటలు చెప్పి వారిపై అత్యాచారం చేశాడు. సయ్యద్ కుమారుడు అఫ్రోజ్ సైతం మహిళ పెద్ద కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులను ఇవ్వమని హసన్ ను ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుంటుండంతో మోసపోతున్నట్లు గుర్తించిన అక్కాచెల్లెళ్లు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పారు.  మహిళతో పాటు బాధితురాళ్లు అయిన ఆమె ఇద్దరు కూతుళ్లు  హసన్,అతడి కొడుకు అఫ్రోజ్ పై చాంద్రాయణగుట్ట పోలీసులకు కంప్లయింట్ చేశారు. మోసంతో పాటు అత్యాచారం కేసులు ఫైల్ చేసిన పోలీసులు తండ్రీ కొడుకులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు. వారి దగ్గరిన ఉంచి భూత వైద్యానికి సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.