
‘జాబు రావాలంటే బాబు రావాలి’… ఇది 2014లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నినాదం. ‘జాబు రావాలంటే బాబు మళ్లీ మళ్లీ రావాలి’… ఇది 2019 ఎన్నికల నినాదం. కానీ మళ్లీ మళ్లీ అవకాశం ఇవ్వాలని జనం అనుకోలేదు. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్సైంది. టీడీపీ అధినేత చంద్రబాబు విజన్ కు అందని విధంగా ఇటు ఏపీలో, అటు కేంద్రంలోనూ ఆయనకే జాబు లేని స్థితి వచ్చింది. తిరుగులేని బలంతో ఉన్న ప్రభుత్వాల ముందు అతి బలహీనమైన ప్రతిపక్షాన్ని ఆయన నడిపించాల్సి ఉంది. ఒకరకంగా బాబు రాజకీయ జీవితంలోనే మొదటిసారి ఇలాంటి గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు.
ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక్కసారిగా చేతిలో పనిలేకుండా పోయింది. ఐదేండ్లు సీఎంగా ఉన్నా, అంతకుముందు పదేండ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆయన ఎప్పుడూ ఖాళీగా లేరు. ఇటు ఏపీలో జగన్, అటు కేంద్రంలో మోడీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడంతో రాజకీయంగా బాబు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి స్థితిలో ఐదేండ్ల పాటు ఆయన పార్టీని నిలబెట్టుకోవాల్సి ఉంది. ఇదే ఇప్పుడు ఆయన ముందున్న పెద్ద సవాలుగా కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీలో ఆయన తర్వాత ఆ స్థాయిలో నడిపించేవాళ్లు ఎవరూ లేరు. చంద్రబాబు కొడుకు లోకేశ్‌ను పదేండ్లుగా పార్టీ నాయకత్వంలో ఉంచారు. ప్రభుత్వంలో మంత్రిని, ఎమ్మెల్సీని కూడా చేశారు. అయితే బాబు లాగ పార్టీని నడిపించే స్థాయికి లోకేశ్ ఎదగలేదు. ఇటు నాయకత్వ సమస్యకు తోడు వయసు మీద పడుతుండడంతో బాబు రాజకీయంగా క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఐదేండ్లు సాగేదెలా?
ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు పూర్తిగా డీలా పడ్డారు. ఎన్నికల ముందు కనిపించిన ఆత్మవిశ్వాసం ఇప్పుడు ఆయనలో కనిపించడం లేదు. బీజేపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌తో దోస్తీ చేసి ప్రాంతీయ పార్టీలను ఒక్కటి చేయాలని ఆయన తీవ్రంగా కష్టపడ్డారు. రాష్ట్రంలోనూ మళ్లీ గెలుపు కోసం చివరి క్షణంలో రకరకాల స్కీమ్‌లతో జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఆయన అంచనాలన్నీ తిర్లమర్ల అయ్యాయి. ఇప్పుడు బాబు వయసు 69 సంవత్సరాలు. ఐదేళ్ల టర్మ్ వరకు ఆయనకు 74 ఏండ్లు వస్తాయి. ఈ వయసులో ఆయన ఒంటరిగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి, నెగ్గుకురాగలుగుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ పదేండ్లు ప్రతిపక్ష నేతగా ఆయన గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నా అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు వయసుతో పాటు మరికొన్ని ఇతర సమస్యలు కూడా ఆయనను వెంటాడుతున్నాయి. జనంలో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టుకోవడమే ఆయన ఎదుర్కోబోయే అతి పెద్ద సవాలు. 2014లో ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీతో బీజేపీతో కలిసి పోటీచేసిన ఆయన ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే రాజీపడ్డారు. తర్వాత ప్యాకేజీపైనే విభేదాలు రావడంతో బీజేపీకి గుడ్ బై చెప్పారు. మళ్లీ ప్రత్యేక హోదా కావాలని పోరాటం మొదలుపెట్టారు. ఇవన్నీ ఆయనపై జనం నమ్మకాన్ని దెబ్బతీశాయి. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని మళ్లీ ఎలా నిలబెట్టుకుంటారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పుడున్న బలంతో ఒక ఎమ్మెల్సీ గానీ, రాజ్యసభ సీటు గానీ గెలిచే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాయకుల వలసలను ఆపడం బాబుకు పెద్ద సవాలే.
సొంత కులానికే ప్రాధాన్యం…
ఐదేండ్ల పాలనలో సొంత కులానికే బాబు ఎక్కువ ప్రయోజనం కలిగించారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. దీంతో ఇతర కులాలవారు దూరమయ్యారు. రెడ్లు పూర్తిగా వ్యతిరేకమై జగన్ కు మద్దతిచ్చారు. కాపులను చేరదీసే క్రమంలో చంద్రబాబు.. పార్టీకి దశాబ్దాలుగా అండగా ఉన్న బీసీలను దూరం చేసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. జన్మభూమి కమిటీల అవినీతి పెరిగిపోవడం జనంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకతకు దారితీసింది. ఇవన్నీ పార్టీ ఓటమికి కారణమయ్యాయి.
ఆ ఒక్క చాన్స్ వస్తుందా?…
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఐదేళ్లు నిలబెట్టుకుంటూ కొనసాగడం ఒక ఎత్తైతే తర్వాత ఏంటన్నదే పెద్ద సందేహం. కొత్త పాలన చూపిస్తానని ప్రకటించిన జగన్ వరుసగా జనాకర్షణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన పాలనను బట్టే ఐదేళ్ల తర్వాత చంద్రబాబు పరిస్థితి ఆధారపడి ఉంది. అవకాశం దొరికే వరకు చంద్రబాబుకు జాబు లేనట్టే.
రెండో లైన్లో ఎవరు?…
చంద్రబాబు పార్టీలో అన్నీ తానే అయి నడిపించడంతో రెండోస్థాయి నాయకుడంటూ ఎదగలేకపోయారు. పార్టీకి తానే కేంద్ర బిందువుగా మారడంతో ఇతర నేతలకు జనంలో పట్టు లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు వారు ఇతర పార్టీల్లోకి మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ వైపు కొందరు, బీజేపీ వైపు మరికొందరు చూస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా బలహీనమైన ప్రతిపక్షంగా మారడంతో ఐదేళ్ల పాటు భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న ఆందోళన కిందిస్థాయి నేతలను వెంటాడుతోంది.
లోకేశ్ నడిపిస్తారా?…
2009కి ముందే లోకేశ్ ను రాజకీయ ప్రవేశం చేయించిన చంద్రబాబు ఆయన్ను పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితం చేశారు. 2014లో ఆయన్ను యాక్టివ్ రాజకీయాల్లోకి తెచ్చారు. 2017లో మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీని చేశారు. అయితే 36 ఏళ్ల వయసున్న లోకేశ్ పార్టీని నడిపించగలిగే స్థాయికి ఎదగలేకపోయారు. మొన్నటి ఎన్నికల్లో మొదటిసారి బరిలోకి దిగి ఆయనే ఓడిపోయారు. జగన్‌ను దీటుగా ఎదుర్కోగలిగే పరిస్థితిలో లోకేశ్ లేరు.