
టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా సోమవారం హైదరాబాద్ లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆక్రమ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఆయనను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా వారి ఆర్థిక లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో ఉన్న సంబందాలు వంటి అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసును మనీ లాండరింగ్ కోణంలో ED లోతైన విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగా, ఈ లావాదేవీలు ఎలా జరిగాయి, వాటి వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాలపై అధికారులు దృష్టి పెట్టింది
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వంటి నటీనటులతో పాటు పలువురిపై అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రచారం చేశారన్న ఆరోపణలున్నాయి. దీనికి గానూ ఆయన అక్రమ మార్గాల్లో, ముఖ్యంగా హవాలా లావాదేవీల ద్వారా, పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నారని ED ఆరోపిస్తుంది .
నిజానికి, రానా దగ్గుబాటి జూలై 23న ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా, షూటింగ్స్ వంటి కారణాల వల్ల మరికొంత సమయం కావాలని కోరారు. దీంతో ఈడీ అధికారులు ఆయనకు ఆగస్టు 11న కచ్చితంగా హాజరుకావాలని సూచించింది. బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయడం ద్వారా పెద్ద మొత్తంలో అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు రానాను విచారిస్తోంది.
►ALSO READ | PEDDI: పూజా హెగ్డే, శ్రీలీల, సమంత.. ముగ్గురిలో పెద్ది ఐటమ్ భామ ఎవరంటే?
ఈ కేసులో ప్రకాష్ రాజ్ జూలై 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న ఈడీ విచారణకు హాజరై తమ అభిప్రాయాన్ని తెలిపారు. మంచు లక్ష్మి ఆగస్టు 13న హాజరుకానున్నారు. ఈ కేసు గురించి ఈడీ, తెలంగాణ పోలీసులు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నటులు ప్రచారం చేసిన బెట్టింగ్ యాప్‌ల వల్ల చాలా మంది యువకులు ఆర్థికంగా నష్టపోయారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఈడీ ప్రధానంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ కేసును విచారిస్తోంది. ఈ కేసులో రానా ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు వివరాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.