
న్యూఢిల్లీ: భారతదేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోర విషాదాల్లో ఒకటిగా నిల్చింది అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనలో దాదాపు 270 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటన జరిగి దాదాపు రెండు నెలలు గడిచిన ఇప్పటికీ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించలేదు ఎయిరిండియా.
ఈ క్రమంలో ఎక్స్గ్రేషియా చెల్లింపులో జాప్యంపై ఎయిరిండియా తీరుపై ప్రముఖ అమెరికా న్యాయవాది మైక్ ఆండ్రూస్ తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశాడు. దివంగత బిజినెస్ టైకూన్ రతన్ టాటా ఉంటే మృతుల కుటుంబాలకు నష్టం పరిహారం అందడంలో ఇలా జాప్యం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో ప్రభావితమైన 65 కుటుంబాలకు పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది మైక్ ఆండ్రూస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. మాకు రతన్ టాటా ఆయన పని తీరు గురించి బాగా తెలుసని పేర్కొన్నారు.
►ALSO READ | జర్నలిస్టులే టార్గెట్: గాజా పై ఇజ్రాయెల్ మెరుపు దాడి, కెమరామెన్ సహా 5 మృతి..
ఉద్యోగుల పట్ల ఆయన ఎప్పుడు కూడా జాలి, దయ, కరుణతో ఉండేవారని అన్నారు. ఇవాళ ఆయన ఉంటే ఎక్స్ గ్రేషియా చెల్లింపులో ఇలా జాప్యం జరగకపోయేదని.. మృతుల కుటుంబాల మానసిక క్షోభను ఆయన వెంటనే అర్థం చేసుకునే వారని పేర్కొన్నారు. ఈ ఘటనలో తన బాగోగులు చూసుకునే ఒక్కగానొక్క కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఓ తల్లి ఇప్పుడు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. ఇప్పుడామె పరిస్థితి ఏంటని నిలదీశారు.
ఇలా ఇతర బాధితులు సైతం ఇబ్బందులు పడుతున్నారని అండ్రూస్ పేర్కొన్నారు. కాగా, అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించిన టాటా గ్రూప్.. మొదటగా రూ.25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని చెల్లించింది. అధికారిక ప్రక్రియ అనంతరం మిగిలిన నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పింది. AI-171 పేరుతో మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్'ను ఏర్పాటు చేసిన టాటా కంపెనీ.. ఈ ట్రస్ట్ ద్వారా మృతులను ఆదుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే.