చిన్నారి క్లియో దొరికింది

చిన్నారి క్లియో దొరికింది
  • ఆస్ట్రేలియా పాప కిడ్నాప్​ సుఖాంతం
  • 18 రోజుల తర్వాత పేరెంట్స్ దగ్గరికి..
  • ప్రధాని నుంచి పౌరుల దాకా
  • వెల్కమ్​ హోమ్​ అంటూ పోస్టులు

కాన్ బెర్రా:మంగళవారం అర్ధరాత్రి.. ఆస్ట్రేలియాలోని ఓ చిన్న టౌన్..​ పోలీసులు ఓ ఇంటిని చుట్టుముట్టారు. క్షణాల్లో తలుపులు బద్దలు కొట్టి లోపలికి దూసుకెళ్లారు. అక్కడ కనిపించింది పాపాయి. నీ పేరేంటమ్మా అని అడిగితే.. ‘మై నేమ్​ ఈజ్​ క్లియో’ అని జవాబిచ్చింది నీరసంగా. పాప జవాబు వినగానే ఓ పోలీసు ఉద్వేగంతో కన్నీళ్లతో ఆమెను దగ్గరికి తీసుకున్నడు. 18 రోజులుగా వాళ్లు వెతుకుతున్నది క్లియో కోసమే. క్లియో దొరుకుతుందో లేదో.. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే టెన్షన్లో ఉన్న పోలీసులకు క్లియో సేఫ్ గా కనిపించడంతో ఆనందం పట్టలేకపోయారు.
అసలు జరిగిందేంటంటే..
పశ్చిమ ఆస్ట్రేలియాలో కార్నర్వాన్ లో ఉండే క్లియో ఫ్యామిలీ అక్టోబర్ 16న 45 మైళ్ల దూరంలోని బ్లోహోల్స్ క్యాంప్ గ్రౌండ్ కు పిక్నిక్ వెళ్లింది. మర్నాటి రాత్రి క్లియో స్లీపింగ్ బ్యాగ్ తో పాటుగా మాయమైపోయింది. పాపే టెంట్ నుంచి దూరం వెళ్లి దారి తప్పి ఉంటుందని తొలుత భావించారు. పోలీసులు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కు దిగినా లాభం లేకపోయింది. తెల్లవారుజామున ఓ వెహికల్ టెంట్ సమీపం నుంచి హడావుడిగా దూసుకెళ్లిందని తేలడంతో కిడ్నాపింగ్ కోణం తెరపైకొచ్చింది. పాపను ఎలాగైనా కాపాడాలంటూ తల్లి ఎల్లీ స్మిత్ టీవీల్లో చేసిన విజ్ఞప్తులు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. చూస్తుండగానే ఈ ఉదంతం నేషనల్ ఇష్యూగా మారింది. రోజూ మీడియాలో హైలైట్ అవుతూ వచ్చింది. పాప క్షేమంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేశారు. ప్రధాని స్కాట్ మారిసన్ వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ వచ్చారు. ఎంత వెతికినా ఏమీ తేలక ఒక దశలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూడా ఎమోషనల్ అయ్యారు. పాప ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల బహుమానం ప్రకటించారు. రోజులు గడుస్తూ ఉండటంతో పాప సజీవంగా తిరిగొస్తుందన్న నమ్మకం ఎవరికీ లేకపోయింది. ఈ దశలో  దొరికిన ఓ చిన్న సమాచారం ఆధారంగా పోలీసులు ఒక్కో చిక్కుముడీ విప్పుకుంటూ మంగళవారం అర్ధరాత్రి నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. తలుపులు బద్దలు కొట్టి క్లియోను కాపాడారు. తనను చేతుల్లోకి ఎత్తుకుని బయటికి తీసుకొస్తున్న ఆఫీసర్ ఆనందోద్వేగాలతో ఒక్కసారిగా కంటతడి పెట్టాడు. దీన్నంతా హెడ్ క్వార్టర్స్ నుంచి మానిటర్ చేస్తున్న ఆఫీసర్లు కూడా అంతే ఉద్వేగానికి లోనయ్యారు. పాప బలహీన స్వరంతో ‘మై నేమ్​ ఈజ్  క్లియో’ అని చెప్తున్న వీడియో క్లిపింగ్ క్షణాల్లో వైరలైంది. దేశమంతా ఆనందబాష్పాలు రాల్చింది. స్కాట్లాండ్ పర్యటన నుంచి తిరిగొస్తున్న ప్రధాని యూఏఈ నుంచే ఈ ఉదంతంపై స్పందించారు. ‘‘పాప క్షేమంగా తిరిగొస్తుందో రాదోనని రెండు వారాల పాటు తన కుటుంబమే గాక దేశమంతా నరకయాతన అనుభవించింది. పోలీసులకు మెనీ మెనీ థాంక్స్” అంటూ యూఏఈలో మీడియాతో  తన ఆనందం పంచుకున్నారు. పాపపై ఏమన్నా అఘాయిత్యం జరిగిందా వంటి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. తను ‘మొత్తానికి’ బాగానే ఉందని చెప్పారు.