
కుషాయిగూడ, వెలుగు : పప్పులో పాము పిల్ల వచ్చిన ఘటన ఈసీఐఎల్‌లోని ఓ ప్రభుత్వ రంగ సంస్థ క్యాంటీన్లో శుక్రవారం చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనానికి సంస్థ ఉద్యోగులు.. క్యాంటీన్‌కు వెళ్లారు. అక్కడ ఓ ఉద్యోగి ప్లేటులో వేసిన పప్పులో చనిపోయిన పాము పిల్ల కనిపించింది. దీంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. అప్పటికే భోజనం చేసిన నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురవడంతో కంపెనీ ఆస్పత్రిలో చికిత్సకు తరలించారు.
దీంతో క్యాంటీన్ నిర్వహించే కాంట్రాక్టర్‌ను సీక్రెట్‌గా యాజమాన్యం విచారిస్తోంది. గతంలోనూ క్యాంటీన్లోని ఫుడ్‌లో బీడీలు, ఎలుకలు, జిల్ల పురుగులు, సిగరెట్లు వచ్చాయిని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు, సంస్థ అధికారులను అడిగితే స్పందించలేదు. కొందరు ఉద్యోగులు మాత్రం పప్పులో పాము పిల్ల వచ్చినది వాస్తవమేనని ఒప్పుకున్నారు. పప్పులో పాము పిల్ల వచ్చిన ఫొటో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.రాత్రి కంపెనీ ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.