
- శాఖల వారీగా ఖాళీలు వెల్లడించాలి
బషీర్ బాగ్ , వెలుగు : తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ శాఖల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. పోస్టుల భర్తీలో రెండు ప్రభుత్వాలు అలసత్వాన్ని వీడాలని సూచించారు. వెంటనే శాఖల వారీగా ఖాళీలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఏపీలో 1998 డీఎస్సీ లో మిగిలిపోయిన 1,482 మంది అభ్యర్థులకు ఎంటీఎస్ పద్ధతిలో న్యాయం చేయాలన్నారు.
గ్రూప్–-1 సర్వీస్ కింద 10 ఏండ్లుగా పోస్టుల భర్తీ చేయలేదన్నారు. గ్రూప్– -2 సర్వీస్ కింద 6 ఏండ్లుగా నోటిఫికేషన్ వేయలేదన్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో పూర్తి స్థాయి డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోట భర్తీ చేయకుండా నామమాత్రంగా భర్తీ చేశారన్నారు. గత 10 ఏండ్లుగా గ్రూప్–-1 స్థాయి పోస్టులు, గ్రూప్-– 2 పోస్టులలో ఎంతోమంది రిటైర్ అయ్యారని, ఎంత మందికి ప్రమోషన్లు ఇచ్చారో లెక్కించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. గ్రూప్–-4 సర్వీస్ అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు గత 25 ఏండ్లుగా భర్తీ చేయడం లేదని వివరించారు.
కేవలం సచివాలయం, డైరెక్టరేట్ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారని, మిగతా జిల్లా, మండల స్థాయి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయడం లేదన్నారు. చాలా ఏండ్ల తర్వాత ఇటీవల జారీచేసిన గ్రూప్-4 సర్వీస్ పోస్టులలో జిల్లా పోస్టులు కలిపారని, మొత్తం పోస్టులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఖాళీలు లెక్కించి వాటిని భర్తీ చేయాలని రెండు రాష్ట్రాలను కృష్ణయ్య డిమాండ్ చేశారు.