ఖమ్మం టౌన్, వెలుగు: మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి ఖమ్మం కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే రూ.లక్ష జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి బి.శ్రీనివాస్ రావు సోమవారం తీర్పు వెల్లడించినట్లు ఖానాపురం హవేలీ ఇన్‌స్పెక్టర్ భానుప్రకాశ్ తెలిపారు.
2024 మే 6న టేకులపల్లిలోని కేసీఆర్ టవర్స్‌కు చెందిన బత్తుల చంద్రశేఖర్ ఓ మానసిక దివ్యాంగ బాలికకు ఐస్‌క్రీం ఇప్పిస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సాక్ష్యాధారాలు, హెల్త్ రిపోర్టులను పరిశీలించిన జడ్జి నిందితుడిపై నేరం రుజువైందని నిర్ధారిస్తూ శిక్ష విధించారు.
హత్య కేసులో మరొకరికి..
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన హత్య కేసులో నిందితుడికి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించినట్లు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం తెలిపారు.
2021 ఆగస్టు 27న ఉదయం బుస్సాపూర్ బస్టాండ్ సమీపంలోని హోటల్ వద్ద సుద్ద లింగన్న టీ తాగుతుండగా, బొర్రయ్యకు చెందిన బైక్‌కు నిందితుడు సోమ నవీన్ నిప్పు పెట్టాడు. దీనిపై లింగన్న, బొర్రయ్య ప్రశ్నించడంతో ఆగ్రహించిన నవీన్ చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత గొడ్డలి, కొంకి తీసుకుని తిరిగి వచ్చి లింగన్నపై దాడి చేయగా చనిపోయాడు.
కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు రెండో అదనపు సెషన్స్ జడ్జి ఎస్. నారాయణ నిందితుడు సోమ నవీన్‌పై అభియోగాలు రుజువయ్యాయని నిర్ధారిస్తూ జీవిత కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు.
