బడిబాటను సక్సెస్ చేయాలి: రంగారెడ్డి కలెక్టర్ శశాంక

బడిబాటను సక్సెస్ చేయాలి: రంగారెడ్డి కలెక్టర్ శశాంక

ఎల్​బీనగర్,వెలుగు: బడి ఈడు పిల్లలను స్కూళ్లలో చేర్పించాలనే సంకల్పంతో బడిబాట నిర్వహిస్తున్నట్టు రంగారెడ్డి కలెక్టర్ శశాంక తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నర్కుడ జడ్పీ స్కూల్ లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై  ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడమే ప్రభుత్వం ఉద్దేశమన్నారు. ఈనెల 6 నుంచి19 వరకు బడిబాట కొనసాగుతుందని, జిల్లా అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు.  

చదువు లేని వారు కుటుంబానికి, సమాజానికి ఎంత భారమో తెలియచేసి బడుల్లో పిల్లలను చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని  చెప్పారు.  కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, శంషాబాద్ తహసీల్దార్ నాగమణి, ఎంపీడీఓ మున్నీ,  సీడీపీఓ షబానా, ఎంఈఓ రాంరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మౌనిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అంగన్ వాడీ  టీచర్లు, అధికారులు పాల్గొన్నారు.