- రోడ్డును కబ్జా చేసి గోడ కట్టడంతో చర్యలు
గచ్చిబౌలి, వెలుగు: హైడ్రా ఒకే రోజు రెండు చోట్ల ఆక్రమణలు తొలగించింది. మేడ్చల్ జిల్లా శామీర్పేటలో కబ్జాకు గురైన రోడ్డు ఆక్రమణలను అధికారులు తొలగించారు. గత 30 ఏండ్లుగా 20 ఫీట్ల కాలనీ వెంచర్ రోడ్డును కొందరు కబ్జాకు చేసి, ప్రహరీ గోడ నిర్మించారని ఫ్రెండ్స్ కాలనీ వాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. పూర్తి విచారణ చేపట్టిన అధికారులు రంగప్రవేశం చేసి రోడ్డును కబ్జా నుంచి తొలగించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న గేటు, ప్రహరీ గోడను గురువారం జేసీబీ సహాయంతో నేలమట్టం చేశారు.
గచ్చిబౌలిలో 2,500 గజాల పార్కు స్థలం సేఫ్
గచ్చిబౌలిలో టెలికాం నగర్ పేరిట బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 1982లో 32 ఎకరాల పరిధిలో అప్పటి హుడా అనుమతితో లేఅవుట్ వేశారు. ఇందులో 4 వేల గజాలు పార్కు కోసం కేటాయించారు. ఇందులో 1,500 గజాల వరకు ఆక్రమణలు జరిగి నివాసాలు ఏర్పడ్డాయి. మిగిలిన 2,500 గజాల స్థలంలో కూడా ప్లాట్లున్నాయంటూ కొంతమంది ఆక్రమణలకు పాల్పడ్డారు. దీంతో టెలికాం నగర్ నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, గురువారం 2,500 గజాల పార్కు స్థలంలో ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ అధికారులు వేశారు.
