చెంగ్డూ: బ్యాడ్మింటన్ ఆసియా అండర్–17, 15 చాంపియన్‌షిప్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ ఖాయమైంది. టాప్ షట్లర్లు లక్ష్య రాజేశ్, దీక్షా సుధాకర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం (అక్టోబర్ 25) జరిగిన అండర్–17 బాలికల సింగిల్స్ సెమీస్‌లో లక్ష్య రాజేశ్ 21–15, 21–19తో రియా హగా (జపాన్)పై గెలిచింది.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇండియన్ ప్లేయర్ ర్యాలీలు, స్మాష్‌లతో చెలరేగింది. కీలక టైమ్‌లో వరుసగా పాయింట్లు గెలిచి ఈజీగా ప్రత్యర్థికి చెక్ పెట్టింది. మరో సెమీస్‌లో దీక్ష 21–8, 21–17తో యున్ చియావో (చైనీస్‌తైపీ)ని ఓడించింది. అండర్–15 సెమీస్‌లో షైనా మణిముత్తు 21–12, 16–21, 21–16తో యున్ జీ యి (చైనా)పై నెగ్గి టైటిల్ ఫైట్‌లోకి ప్రవేశించింది.
ఫైనల్లో షైనా.. చిహారు తొమిటా (జపాన్)తో తలపడనుంది. ఇందులో నెగ్గితే ఇండియాకు రెండో గోల్డ్ మెడల్ కూడా లభిస్తుంది. అండర్ –17 మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో జంగ్జీత్ సింగ్ క్లాజా–జననికా రమేష్ 17–21, 21–18, 21–16తో అన్ చాంగ్–హో హన్ వాంగ్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడారు. బాయ్స్ డబుల్స్ ఫైనల్లోనూ ఇండియాకు ఓటమి ఎదురైంది. సింగిల్స్ సెమీస్‌లో జగ్షేర్ సింగ్ కంగురా 11–21, 16–21తో హంగ్ టియాన్ యు (చైనా) చేతిలో ఓడాడు.
