- గాయంతో సాత్విక్-చిరాగ్ దూరం
- సింధు, లక్ష్యసేన్‌పైనే ఆశలు
నింగ్బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఆరంభానికి ముందు ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ -– చిరాగ్ శెట్టి మంగళవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. సాత్విక్ భుజం గాయం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోచ్ టాన్ కిమ్ హెర్ వెల్లడించాడు. మరోవైపు సింగిల్స్‌లో లక్ష్య సేన్, పీవీ సింధు ఇండియా సవాల్‌కు నాయకత్వం వహించనున్నారు. ఈ టోర్నీలో ఇండియాకు సింగిల్స్ టైటిల్ దక్కి 61 ఏండ్లు కావస్తోంది. 1965లో దినేశ్ ఖన్నా మెన్స్ సింగిల్స్‌లో గోల్డ్ నెగ్గిన మరో ఇండియన్ ఆ ఘనత సాధించలేదు. ఇటీవల ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన లక్ష్య సేన్, ఈసారి గోల్డ్ మెడల్‌తో ఆ నిరీక్షణకు తెరదించాలని పట్టుదలగా ఉన్నాడు.
తొలి రౌండ్‌లో తను హాంకాంగ్‌కుచెందిన లీ చెయుక్ యియుతో తలపడనున్నాడు. హెచ్‌ఎస్ ప్రణయ్ క్వాలిఫయర్ ప్లేయర్‌తో తన పోరును ఆరంభిస్తాడు. మాజీ వరల్డ్ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి మ్యాచ్‌లో సింగపూర్‌కు చెందిన ఎనిమిదో సీడ్ లో కీన్ యూతో తలపడనున్నాడు. ఇక విమెన్స్ సింగిల్స్‌లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుపై భారీ అంచనాలున్నాయి. కానీ, తను కూడా గాయం నుంచి కోలుకొని వస్తోంది. తొలి మ్యాచ్‌లో మలేసియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌తో తలపడనుంది. ఉన్నతి హుడా, మాళవిక బన్సోద్, తన్వీ శర్మ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ జోడీ విత్‌డ్రా అవడంతో అశ్విని భట్--–శిఖా గౌతమ్, శ్రుతి మిశ్రా–ప్రియ పోటీలో మిగిలారు.
