సింధు ఈజ్ బ్యాక్: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ శుభారంభం

సింధు ఈజ్ బ్యాక్: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ శుభారంభం

పారిస్: గతకొంత కాలంగా ఫామ్ లేమితో సతమతమవుతోన్న ఇండియన్ స్టార్ షట్లర్ పీవీ సింధు తిరిగి ఫామ్‎లోకి వచ్చింది. 2025, ఆగస్ట్ 25 నుంచి పారిస్ వేదికగా ప్రారంభమైన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధు శుభారంభం చేసింది. మంగళవారం (ఆగస్ట్ 26) జరిగిన తొలి రౌండ్‎లో సింధు ఏకపక్ష విజయం సాధించింది. బల్గేరియన్ క్రీడాకారిణి కలోయానా నల్బంటోవాను 23-21, 21-6 తేడాతో వరుస గేమ్‌లలో చిత్తు చేసి రెండో రౌండ్‎కు దూసుకెళ్లింది. 

పారిస్‌లోని అడిడాస్ అరీనాలో జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు వార్ వన్ సైడ్ చేసింది. తొలి సెట్‎లో 3-7తో తడబడ్డ భారత షట్లర్.. ఆ తర్వాత బలంగా పుంజుకుంది. 12-12తో స్కోర్ సమం చేసి చూస్తుండగానే 15-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కలోయానా కాస్తా ప్రతిఘటించిన సింధు అద్భుతంగా ఆడి 22-21తో మొదటి సెట్‎లో విజయం సాధించింది.

మొదటి సెట్ హోరాహోరీగా సాగగా.. రెండో సెట్‎ను సింధు ఏకపక్షం చేసింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెరుపు షాట్లతో విరుచుకుపడింది. 11-5తో ఆధిక్యంలో ఉన్న సింధు.. ఆ తర్వాత ఒక్క పాయింట్ మాత్రమే కోల్పోయి 21-6 తేడాతో రెండో గేమ్‎ను అలవోకగా గెల్చింది. 23-21, 21-6 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి ఆటను ముగించింది. 

తొలి రౌండ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ విజయం:

భారత పురుషుల బ్యాడింటన్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ విజయంతో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌ను ఆరభించాడు. మంగళవారం (ఆగస్ట్ 26) జరిగిన తొలి రౌండ్ మ్యాచులో ఫిన్లాండ్‌కు చెందిన ప్రపంచ 47వ ర్యాంకర్ జోకిమ్ ఓల్డోర్ఫ్‌పై ప్రణయ్ విజయం సాధించాడు.  21-18-21-15 తేడాతో  జోకిమ్ ఓల్డోర్ఫ్‌‎ను చిత్తు చేశాడు. ఒలింపిక్స్ తర్వాత తన ఫిట్‌నెస్, ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న ప్రణయ్ ఈ మ్యాచ్ ప్రారంభంలొ కాస్త తడబడ్డాడు.

 మొదటి గేమ్‌లో 2-5తో వెనుకబడిన ప్రణయ్ తిరిగి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మొదటి గేమ్‌ను కైవసం చేసుకునే వరకు ఆధిక్యాన్ని అలాగే కొనసాగించాడు. రెండవ గేమ్‌లో 4-1తో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్.. ఆట చివరి వరకు ఆధిపత్యం కొనసాగించాడు. చివరకు 21-15 తేడాతో రెండో సెట్‎ను గెల్చుకున్నాడు.