ప్రత్యర్థులు వాళ్లే.. పార్టీలే వేరు.. ఆసక్తికరంగా బద్నావార్ ఎన్నికలు

ప్రత్యర్థులు వాళ్లే.. పార్టీలే వేరు.. ఆసక్తికరంగా బద్నావార్ ఎన్నికలు

ఇండోర్: మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని బద్నావార్ సెగ్మెంట్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఈ ఎన్నికలు వచ్చేసరికి పార్టీలు మారడమే దీనికి కారణం. అంటే.. అభ్యర్థులు వాళ్లే కానీ పార్టీలు వేరు. బీజేపీ నుంచి ఇండ్రస్ట్రియల్ పాలసీ అండ్ ఇన్వెస్ట్​మెంట్ ప్రమోషన్ మినిస్టర్ రాజవర్ధన్ సింగ్ (51) పోటీలో ఉండగా.. కాంగ్రెస్ తరఫున భన్వర్ సింగ్ షెకావత్ (72) బరిలో ఉన్నారు. రాజ్​పుత్ వర్గానికి చెందిన ఈ నేతలిద్దరూ పోటీ పడడం ఇది మూడోసారి.  ఈ సెగ్మెంట్​లో ట్రైబల్, పాటిదార్ కమ్యూనిటీలు కూడా అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఈ రెండు వర్గాలకు చెందిన ఓట్లు సుమారు 2.21 లక్షల దాకా ఉంటాయి. 2018 మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అభ్యర్థి షెకావత్ పైన రాజవర్ధన్ సింగ్(కాంగ్రెస్) బద్నావార్ సెగ్మెంట్ నుంచి గెలిచారు. జ్యోతిరాదిత్య సింధియాకు రాజవర్ధన్ సింగ్ చాలా దగ్గర. 2020లో సింధియా 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. ఇందులో రాజవర్ధన్ సింగ్ కూడా ఉన్నారు. ఇక బద్నావార్ సెగ్మెంట్ టికెట్ కోసం బీజేపీలోనే ఉన్న షెకావత్, రాజవర్ధన్ సింగ్ తీవ్ర పోటీపడ్డారు. చివరికి సెప్టెంబర్ 2న షెకావత్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాజవర్ధన్ సింగ్​ ఈసారి బీజేపీ టికెట్​ పై.. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన షెకావత్​ ఈసారి కాంగ్రెస్ టికెట్​ తో బరిలో నిలిచారు. 2013లో షెకావత్​గెలిస్తే.. 2018, 2020 (బై ఎలక్షన్స్)లో రాజవర్ధన్ సింగ్ విజయం సాధించారు. షెకావత్ బీజేపీలో ఉన్నప్పుడు సెగ్మెంట్​ను అభివృద్ధి చేయలేదని, కరోనా టైమ్​లో అస్సలు కనిపించలేదని రాజవర్ధన్ సింగ్ మంగళవారం విమర్శించారు. తాను కాంగ్రెస్ వీడి.. బీజేపీలో చేరాక నియోజకవర్గం డెవలప్ అయిందన్నారు. రాజవర్ధన్ సింగ్ చేసిన లోకల్ వర్సెస్ ఔట్ సైడర్ విమర్శలను షెకావత్ తిప్పికొట్టారు. కాంగ్రెస్​లో కొత్తవాడినే అయినా.. బద్నావర్ సెగ్మెంట్ కొత్త కాదని షెకావత్ అన్నారు.

అభ్యర్థులను మార్చాలి : మాజీ సీఎం కమల్​నాథ్ ఇంటి ముందు కార్యకర్తల నిరసన

భోపాల్: మధ్యప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను మార్చాలంటూ పలువురు కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. హుజూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మార్చాలని డిమాండ్ చేస్తూ భోపాల్​లోని మాజీ సీఎం, పార్టీ స్టేట్ చీఫ్ కమల్​నాథ్ ఇంటి ముందు కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు హనుమాన్ చాలీసా చదువుతూ నిరసన చేపట్టారు. సర్వేలో వచ్చిన రిపోర్టు ఆధారంగా కాంగ్రెస్ అధిష్టానం టికెట్లు కేటాయించలేదని మండిపడ్డారు. వచ్చే నెల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హుజూర్ సెగ్మెంట్ సీటును నరేశ్​ గ్యాన్​చందానీకి హైకమాండ్ కేటాయించింది. దీన్ని అక్కడి లీడర్లు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. హుజూర్​లో కాంగ్రెస్ గెలవాలని, కమల్​నాథ్ సీఎం కావాలని కోరుతూ హనుమాన్ చాలీసా చదివినట్లు కాంగ్రెస్ లీడర్లు తెలిపారు.