ఢిల్లీలో ఘనంగా రాములోరి పెళ్లి

ఢిల్లీలో ఘనంగా రాములోరి పెళ్లి

భద్రాచలం, వెలుగు: దేశ రాజధాని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్​లోగల అంబేద్కర్ ఆడిటోరియంలో శనివారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారికంగా ఈ కల్యాణాన్ని నిర్వహించారు. ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధులు వేణుగోపాలాచార్యులు, తేజావత్​రామచంద్రునాయక్, డా.మందా జగన్నాథం, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ భవన్​కమిషనర్​వేదాంతం గిరి తదితరులు ఈ కల్యాణంలో పాల్గొన్నారు. ముందుగా ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, ఆరాధన చేశాక కల్యాణ క్రతువును ఆరంభించారు. ముందుగా స్వామికి కంకణధారణ, రక్షాబంధనం చేశారు. యజ్ఞోపవీతధారణ అయ్యాక జీలకర్రబెల్లం, సుమూహుర్తంలో మాంగల్యధారణ తర్వాత తలంబ్రాల వేడుక జరిగింది.