
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలను కార్గిల్ యుద్ధ కాలం నాటి పరిస్థితులతో పోల్చుతూ బీజేపీపై తీవ్ర విమర్శలకు దిగారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్. అప్పటి ప్రధాని వాజ్ పేయీ కి.. ప్రస్తుత ప్రధాని మోదీకి పొంతనే లేదని.. అప్పటి బీజేపీ, ఇప్పటి బీజేపీకి చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. ఆదివారం (జులై 27) పహల్గాం దాడి, కార్గిల్ యుద్ధాలను పోల్చుతూ బీజేపీపై దాడికి దిగారు ఆయన.
కార్గిల్ యుద్ధం తర్వాత రివ్యూ కోసం నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన వాజ్ పేయీ నిర్ణయాన్ని కోట్ చేస్తూ.. ఆ ప్రధానికి, ప్రస్తుత ప్రధానికి మోదీకి చాలా తేడా ఉందని అన్నారు. 1999 లో కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత సమీక్ష కోసం వాజ్ పేయీ ప్రభుత్వం నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుత విదేశీ వ్యవహారాల మంత్రి తండ్రి అయిన కె.సుబ్రహ్మణ్యం ఆ కమిటీకి అధ్యక్షత వహించారు. 1999 డిసెంబర్ 15న ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 2000 ఫిబ్రవరి 23 న అప్పటి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దానిపై చర్చ కూడా జరిగింది. అప్పటి ప్రధాని వేరు.. ఆ బీజేపీ వేరు.. అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు.. అని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ పై మరొక్క రోజులో పార్లమెంటులో చర్చ జరగనున్న సందర్భంలో జైరాంరమేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోమవారం (జులై 28) లోక్ సభలో చర్చ జరగనుండగా.. ఆ తర్వాతి రోజు రాజ్యసభలో చర్చిస్తారు.
►ALSO READ | ఈ సిటీ నన్ను ఏడిపిస్తోంది, ఆఫీస్ వెళ్లాలంటే నరకం: ఓ ఉద్యోగి ఆవేదన..
అయితే ఏప్రిల్ 22న జరిగిన దాడికి సంబంధించిన దుండగులను ఇప్పటికీ పట్టుకోకపోవడంతో బాధితులకు న్యాయం చేయలేకపోయారని విమర్శించారు.పహల్గాం దాడిలో పాల్గొన్న టెర్రరిస్టులు పూంచ్ దాడి (డిసెంబర్ 2023), గంగాగిర్, గుల్మార్గ్ (అక్టోబర్ 2024) దాడులకు పాల్పడ్డారని.. వారిని ఇప్పటికీ శిక్షించలేకపోయారని అన్నారు.
దాడి జరిగిత తర్వాత ప్రధాన మంత్రి ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొనకపోవడం దారుణమని అన్నారు. ప్రధాని ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినప్పటికీ.. రక్షణ శాఖ మంత్రి అధ్యక్షత వహించారని.. ఇంటెలిజెన్స్ వైఫల్యంపై సమాధానం చెప్పలేకపోయారని విమర్శించారు.
ఇండియా-పాకిస్తాన్ కాల్పుల విరమణ తన వల్లనే జరిగిందని చెప్పిన ట్రంప్.. పాక్ ఆర్మీ చీఫ్ తో లంచ్ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్ ను నేను ఆపానని మే 10 నుంచి ట్రంప్ దాదాపు 26 సార్లు చెప్పుకున్నారు. యుద్ధం ఆపకపోతే ట్రేడ్ ఆపేస్తానని.. మరోవైపు ఇండియాకు చెందిన ఐదు ఫైటర్ జెట్లు కూలిపోయినట్లు ట్రంప్ చెప్పారు. అదే విధంగా యూఎస్ సెంట్రల్ కమాండ్ జనరల్.. పాకిస్తాన్ తమకు కౌంటర్ టెర్రరిజంలో ప్రధాన భాగస్వామి అని చెప్పడం, నిన్నటికి నిన్న పాకిస్తాన్ ఉప ప్రధాని సమక్షంలో యూఎస్ సెక్రెటరీ పాకిస్తాన్ ను పొగడటం.. వీటిపై మోదీ స్పందనేదని ప్రశ్నించారు.