ఈ సిటీ నన్ను ఏడిపిస్తోంది, ఆఫీస్‌ వెళ్లాలంటే నరకం: ఓ ఉద్యోగి ఆవేదన..

 ఈ సిటీ నన్ను ఏడిపిస్తోంది, ఆఫీస్‌ వెళ్లాలంటే నరకం: ఓ ఉద్యోగి ఆవేదన..

చాల మంది జీవితంలో ఆఫీస్ లైఫ్ అనేది ఉంటుంది. అయితే ఈ కాలంలో మాత్రం మెట్రో నగరాల్లో జాబ్ చేసే వారి సంఖ్యా మరింత పెరిగిపోయింది. ఈ ఉరుకుల పరుగుల జీవితానికి తోడు సిటీ ట్రాఫిక్, ఇంకా వర్షాకాలంలో ట్రాఫిక్ బాధలు ఎంత చెప్పుకున్న తక్కువే. 
 
అయితే ఆఫీసుకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న ఓ ముంబై వాసి రెడ్డిట్‌ ద్వారా తన పరిస్థితి గురించి విలపిస్తూ ముంబై సిటీ నన్ను ఏడిపిస్తోందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం  వైరల్ అవుతున్న పోస్ట్‌లో నిత్యం ప్రయాణాలు, కార్పొరేట్ లైఫ్ ఒత్తిళ్ల వల్ల పడుతున్న నష్టాల గురించి వివరించారు. అతని జాబ్ నవీ ముంబైలో ఉండగా డోంబివ్లిలోని తన ఇంటి నుండి ఆఫీసుకు ప్రతిరోజూ కష్టంగా ప్రయాణం చేయాల్సి  వస్తుందని  విలపించుకున్నాడు. 

అతని మాటల ప్రకారం చూస్తే "నా ఆఫీసు నవీ ముంబైలో ఉంది, నేను డోంబివ్లిలో ఉంటున్నాను. ప్రతిరోజూ ఆఫీసు వెళ్ళడానికి నాకు 1 నుండి 2 గంటల సమయం పడుతుంది. అంటే మొత్తంగా 3 గంటల ప్రయాణం,  9 గంటలు ఆఫీస్ పని. నేను విసుగు చెందాను. ప్రతిరోజు నేను రాజీనామా చేయాలని అనుకుంటాను, కానీ చేయలేను ఎందుకంటే ప్రస్తుతం నాకు వేరే అవకాశం లేదు. ఈ కార్పొరేట్ జీవితంతో విసిగిపోయా. 

రోజు జర్నీ, ఆఫీస్ పని గంటల తర్వాత టైం లేకపోవడంతో జిమ్, పుస్తకాలు చదవడం వంటి చిన్న చిన్న అలవాట్లు కూడా  ఆస్వాదించలేకపోతున్న. నాకు ఇది అస్సలు ఇష్టం లేదు, దీని వల్ల ప్రతిరోజూ ఏడుపు వస్తుంది. కాస్త నన్ను బ్రతికించే పనులు చేయాలనుకుంటున్నాను, కానీ నేను ఆఫీసు నుండి రాగానే రాత్రి భోజనం చేసి వెంటనే నిద్రపోతాను అంటూ పోస్టులో పేర్కొన్నాడు. 

►ALSO READ | ఫారెన్ టూర్లు, వందల కోట్లు, లగ్జరీ కార్లు: ఎంబసి ఆఫీసు పేరుతో బయటపడ్డ బడా స్కాం..

ఈ పోస్ట్ వైరల్ కావడంతో వందల కొద్దీ లైక్స్, సోషల్ మీడియాలో కొందరు సానుభూతి చూపగా, మరికొందరు జర్నీ సమయాన్ని తగ్గించుకోవడానికి ఆఫీస్ దగ్గర్లోకి మారాలని సూచించారు. మీ జాబ్ ఉండే లొకేషన్లోకి మారడం ఉపయోగకరంగా ఉంటుంది. మీ టైం, శక్తి, ప్రయాణ ఖర్చులు కూడా ఆదా అవుతాయి అని ఒకరు అనగా, మరొకరు ఇది చాలా నిజం. నేను కొంతకాలం క్రితం ముంబైకి వెళ్లాను, మన నగరాల స్థితిని మనం ఎంత సులభంగా అంగీకరించామో అనిపించింది. అద్దె, ప్రయాణం, ఖర్చులు ఇవి పూర్తిగా ఉండడానికి సాధ్యం కానివి అని అన్నారు.  

దేశ వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన ముంబై,  ప్రజా రవాణా వ్యవస్థకు పేరు పొందింది. లోకల్ ట్రైన్స్  ఉన్నగాని  పెరుగుతున్న జనాభా కారణంగా అవి కూడా రద్దీగా ఉంటాయి, దీని వల్ల తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి  వస్తుంది అంటున్నారు నెటిజన్లు.