చోరీకి గురైన సీఆర్పీఫ్​ పోలీసుల బుల్లెట్లు దొరికాయి.. దొంగ చిక్కాడు

చోరీకి గురైన సీఆర్పీఫ్​ పోలీసుల బుల్లెట్లు దొరికాయి.. దొంగ చిక్కాడు

హైదరాబాద్ ​: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అక్టోబర్​ 24న చోరీకి గురైన సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల బ్యాగు దొరికింది. వారి బ్యాగులో ఉన్న బుల్లెట్లు కూడా లభించాయి. దీంతో బాధిత పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే...? 

నలుగురు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు బెనారస్​ వెళ్లేందుకు అక్టోబర్​ 24న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లారు. దానాపూర్ ఎక్స్​ప్రెస్ రైలు కోసం ఎదురు చూస్తున్న కానిస్టేబుళ్లు.. కాసేపు సేద తీరారు. ఈ సమయంలోనే ఓ వ్యక్తి సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల బ్యాగును ఎత్తుకెళ్లాడు. చోరీకి గురైన బ్యాగులో మూడు మ్యాగజైన్లు, 60 బుల్లెట్లు ఉన్నాయి. ఇదే విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్​తో పాటు రైల్వే పోలీసులకు బాధిత పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు.

ఈ కేసును సీరియస్​గా తీసుకున్న పోలీసులు.. ఎనిమిది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టి.. నిందితుడిని సికింద్రాబాద్ ​గాంధీ ఆస్పత్రి మెట్రోస్టేషన్ వద్ద పట్టుకున్నారు. అయితే.. నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు కూడా షాక్​ అయ్యారు. బ్యాగులో డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో తాను చోరీ చేశానని, కానీ.. అందులో డబ్బులు లేవని, బుల్లెట్లు ఉండడం చూసి భయపడి.. ఆ బ్యాగును అక్కడే వదిలేశానని పోలీసులకు చెప్పాడు నిందితుడు.

బుల్లెట్లు ఉన్న బ్యాగును మరో వ్యక్తి తీసుకువెళ్లాడు. ఈ విషయాన్ని గమనించి సదరు వ్యక్తి నుంచి పోలీసులు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 21 సంవత్సరాల ఆనంద్ మూర్తిగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును చేధించిన పోలీసులను తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అభినందించారు.