బషీర్బాగ్, వెలుగు: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అధిక ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని బహుజన ప్రజాశక్తి (ఉద్యమ వేదిక) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బహుజన ప్రజాశక్తి సిటీ ఇన్చార్జ్ ప్రకాశ్ తో కలిసి కన్వీనర్ నల్ల లక్ష్మణ్ మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యాకు 25 శాతం నిధులు కేటాయించాలన్నారు.
ప్రభుత్వ కాలేజీల సంఖ్య పెంచాలని, ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర నాయకులు ఉదారి మల్లేశ్, విష్ణు కుమార్, పీ నర్సింగ్ రావు, ఎర్ర నాగయ్య, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
