
కాగజ్ నగర్, వెలుగు: కేసీఆర్ పాలనలో ప్రతీ పేద కుటుంబానికి అన్యాయమే జరిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇప్పుడు ప్రజలంతా బీఎస్పీ వైపు చూస్తున్నారని, మిగతా పార్టీల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా బీఎస్పీ లో చేరేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బీఎస్పీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
తర్వాత వాసవీ గార్డెన్స్‌లో పలువురు మైనారిటీ నాయకులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఓడించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో హామీ మేరకు సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకు ఇవ్వాల్సిన రూ.35,000 బోనస్ వడ్డీతో సహా సెప్టెంబర్ 5 లోపు చెల్లించకపోతే కార్మికులతో పెద్ద ఎత్తున సమ్మె చేస్తామని హెచ్చించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, మాజీ జడ్పీటీసీ పిల్లల తిరుపతి, సీతానగర్ ఎంపీటీసీ జామున మహేశ్, కంబలె గౌతం, సెక్టర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.