
- మంత్రి పొన్నం ప్రభాకర్
చేర్యాల, వెలుగు : బైరాన్‌పల్లి అమరుల బలిదానాలే తెలంగాణ స్వాతంత్ర్యానికి పునాదులు వేశాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బుధవారం సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో అమరవీరులకు మంత్రి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరో జలియన్‌వాలా బాగ్‌లా మారిన బైరాన్‌పల్లికి తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రత్యేకత ఉందన్నారు.
అమరుల ఆశయాలను నేటి ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. వారి స్ఫూర్తితోనే నీళ్లు, నిధులు, నియామకాలు, సంక్షేమం, అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి బైరాన్‌పల్లిలో అమరుల స్మారక చిహ్నం నిర్మించడంతో పాటు చారిత్రక బురుజు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బైరాన్‌పల్లి అభివృద్ధికి రూ. 10 లక్షలు కేటాయిస్తున్నట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, మాజీ జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, జనగాం నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్ చెట్కూరి కమలాకర్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకటాచారి పాల్గొన్నారు.