షేర్​చాట్​, స్నాప్​చాట్ ​యాప్​లతో ​మహిళలకు ఎర

షేర్​చాట్​, స్నాప్​చాట్ ​యాప్​లతో ​మహిళలకు ఎర

హసన్​పర్తి, వెలుగు :  షేర్​చాట్​,  స్నాప్ చాట్  ఆండ్రాయిడ్  యాప్​తో యువతులను మోసం చేసి డబ్బు, బంగారం  కాజేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజు  తెలిపారు.  బుధవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్​ సత్యసాయి జిల్లా  కొత్త చెరువు మండలంలోని కలమర్ల గ్రామానికి చెందిన ఇమ్రాన్(32) ఈజీగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో షేర్ చాట్,  స్నాప్ చాట్ యాప్​లతో మహిళల నుంచి డబ్బు, బంగారు నగలను దోచుకొనేందుకు ప్లాన్​ వేశాడు. 

ఇందులో భాగంగా హసన్ పర్తి మండలానికి చెందిన ఓ మహిళతో  రెండు నెలల కింద షేర్ చాట్ ఆండ్రాయిడ్ యాప్ లతో పరిచయం పెంచుకున్నాడు.  ఇమ్రాన్​ తాను ధనవంతుడినని,  సత్యసాయి జిల్లాలో సొంత ఇల్లు ఉందని, తన వద్దకు వస్తే ఇద్దరం కలిసి ఉందామని సదరు మహిళను నమ్మించాడు.  అతడి మాటలు నమ్మి  బాధిత మహిళ తన ఇంటిలోని బంగారు ఆభరణాలను తీసుకోని ఈ నెల 8న ఇంటి నుంచి వెళ్లి సత్యసాయి జిల్లాలోని ఇమ్రాన్​ వద్దకు  వెళ్లింది.  కలిసి జీవించేందుకు ముందుగా డబ్బు అవసరమని,  తిరిగి ఇస్తానని బాధిత మహిళను నమ్మించి, ఆమె వద్ద ఉన్న బంగారంలో  కొంత బంగారం  తీసుకుని ముత్తూట్  ఫైనాన్స్ లో  తాకట్టుపెట్టి  రూ.1.50 లక్షలను తన అకౌంట్​లోకి మళ్లించుకున్నాడు.

 డబ్బు రావడంతో నిందితుడు బాధిత మహిళతో.. కలిసి అనంతపురం,  వైజాగ్, గాజువాక, విజయవాడ, బెంగుళూరు, హంపి ప్రాంతాల్లో గెస్ట్​హౌస్​లతో పాటు, తెలిసిన స్నేహితుల ఇండ్లలో  బస చేశారు.  సదరు మహిళ అదృశ్యంతో  కుటుంబ సభ్యులు పోలీస్​ స్టేషన్​లో  ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల వద్ద ఉన్న టెక్నాలజీని వాడుకుని నిందితుడితో పాటు, బాధిత మహిళ కదలికలపై నిఘా పెట్టారు.  

బుధవారం  ఇమ్రాన్​, బాధిత మహిళతో రైలులో హైదరాబాద్ నుంచి కాజీపేట మీదుగా విజయవాడకు పోలీసులు వెళ్తున్నట్లు గుర్తించారు. వారు ప్రయాణిస్తున్న రైలులో తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు.  ఇంతకుముందు కూడా ఇలాంటి నేరాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. బాధిత మహిళను  కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.  హసన్ పర్తి సీఐ  గోపి, ఎస్ఐ రాజు, ఏఏవో సల్మాన్​పాషా, క్రైం కానిస్టేబుల్ క్రాంతికుమార్ పాల్గొన్నారు.