
యువతులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వెకిలి చేష్టలతో ఇబ్బందులకు గురిచేసే వారిలో కుర్రకారే కాదు.. కొందరు వృద్ధులు కూడా ఉన్నారనటానికి ఈ వార్త ఒక ఉదాహరణ. మనుమళ్లు, మనుమరాళ్లను ఎత్తుకునే వయసులో బుద్ధి గడ్డితిన్నట్లుగా తప్పులు చేస్తున్నారు. ఎవరూ చూడరులే అన్న ధోరణిలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. విషయం బయటకు వచ్చే సరికి పరువు, మర్యాదలు గుర్తొచ్చి ప్రాణాలను తీసుకుంటున్నారు. తప్పు చేశాక పశ్చాతాపం చెందుతున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించి.. ఆమెను తాకరాని చోట తాకి.. ఒక 70 ఏళ్ల వృద్ధుడు నీచంగా ప్రవర్తించాడు. పంచాయతీ పెడతామనే సరికి పరువు పోతుందని ప్రాణాలు తీసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. కుత్భుల్లాపూర్ సూరారం పీయస్ పరిధిలోని కైసర్ నగర్ లో ఉన్న డబుల్ బెడ్రూం అపార్ట్ మెంట్ లో వృద్ధుడు సూసైడ్ చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.ఈ వృద్ధుడు మంగళవారం (సెప్టెంబర్ 09) రోజు మహిళను అసభ్యకరంగా తాకాడు. ఈ విషయంలో పరువు పోతుందని భావించి.. ఇవాళ (బుధవారం10) ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కైసర్ నగర్ డబుల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ లో రాజు అనే వృద్ధుడు మహిళను అసభ్యకరంగా తాకిన ఘటన వివాదాస్పదం అయ్యింది. మెట్లపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఇబ్బందికరంగా తాకడంతో.. ఆమె తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో రాజు వ్యవహారంపై పెద్దల సమక్షంలో బుధవారం పంచాయతీ పెడదామని నిర్ణయించారు.
ఈ విషయం తెలిసి ఆ వృద్ధుడు ఆందోళనకు లోనయ్యాడు. పెద్దల సమక్షంలో పంచాయతీ అంటే.. పరువుపోతుందనే భయంతో బుధవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాడీనీ పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.