
మెదక్: మెదక్ జిల్లాలో రాబోయే రెండు మూడు గంటల పాటు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం అసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లా్ల్లో ముసురు పట్టి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉందని చెప్పింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్ సిటీలో మబ్బు పట్టి ఉండి ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. రాత్రిపూట పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్ నగరంలో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెలంతా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో పాటు.. వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.