
అరటి పండ్ల పేరున 35 లక్షల రూపాయలు.. ఈవెంట్ మేనేజ్మెంట్ కు ఆరున్నర కోట్లు.. టోర్నమెంట్, ట్రయల్ ఖర్చుల పేరున 26 కోట్లు.. ఇది ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ చేసిన ఖర్చులు. ఈ ఖర్చులపై దర్యాప్తు కోసం బీసీసీఐకి బుధవారం (సెప్టెంబర్ 10) నోటీసులు జారీ చేసింది ఉత్తరాఖండ్ హైకోర్టు.
ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (CAU) 12 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని.. టోర్నమెంట్స్ కోసం కేటాయించిన ఫండ్స్ ను దారిమళ్లించారని.. విచారించాలని కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. CAU ఆడిట్ రిపోర్టును ఆధారంగా నిధుల దుర్వినయోగంపై దర్యాప్తుకు ఆదేశించాలని కోర్టును కోరారు పిటీషనర్లు. ఆడిట్ రిపోర్టులో ప్లేయర్స్ కోసం 35 లక్షల రూపాయలు అరటి పండ్లు కొనేందుకు ఖర్చు చేసినట్లుగా ఉందని పేర్కొన్నారు.
డెహ్రాడూన్ నివాసి అయిన సంజయ్ రావత్, మరి కొందరు కలిసి దర్యాప్తు కోసం కోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ ఆధ్వర్యంలో సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. నిధుల దుర్వినియోగంపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ దర్యాప్తు జరపాలని BCCI కి నోటీసులు జారీ చేసింది.
ఆడిట్ రిపోర్టులో 6 కోట్ల 40 లక్షలు ఈవెంట్ మేనేజ్ మెంట్ కు ఖర్చు చేసినట్లు ఉంది. అదే విధంగా టోర్నమెంట్, ట్రయల్ ఖర్చుల పేరున 26 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ రిపోర్టులో పేర్కొంది. దీనిపై పిటీషనర్ల వాదనలు విన్న కోర్టు.. విచారణ చేపట్టాల్సిందిగా బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి వాదనలు శుక్రవారానికి (సెప్టెంబర్ 12) వాయిదా వేసింది కోర్టు.