
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మెగా ఫోన్ పట్టబోతున్నారు. ఈ సారి హీరోగా కంటే దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. లేటెస్ట్ గా వచ్చిన ఈ వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త్వరలోనే 'క్రిష్ 4' మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. బడ్జెట్ విషయంలో ఇప్పటి వరకు ఉన్న గందరగోళం తొలగిపోయింది. దీంతో ఈ మూవీ షూటింగ్ కు లైన్ క్లియర్ అయింది.
ఇటీవల ఓ ఇంటర్యూలో దర్శకుడు, నిర్మాత రాకేష్ రోషన్ 'క్రిష్ 4' మూవీపై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. కథ చాలా తక్కువ సమయంలోనే సిద్ధమైనప్పటికీ.. బడ్జెట్ విషయంలోనే కొంత ఆలస్యమైందని తెలిపారు. ఇప్పుడు ఈ సమస్య షరిష్కారమైంది. అందుకే ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధమయ్యామని వివరించారు. భారీ బడ్జెట్ లో అభిమానుల అంచనాలకు మించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది మధ్య నాటికి ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభవుతుందని రాకేష్ రోషన్ తెలిపారు. ఈ 'క్రిష్ 4 'సినిమాకు ప్రీప్రొడక్షన్ పనులు ఎక్కువ. అందుకే షూటింగ్ వెళ్లే ముందు అన్ని పూర్తిగా సిద్ధంగా ఉండాలి. అన్ని కార్యక్రమాలు సక్రమంగా పూర్తయితే 2027లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. అంతే కాదు ఈ ఏడాది మార్చిలో తన కుమారుడు హృతిక్ రోషన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.
"డిగ్గూ, 25 ఏళ్ల క్రితం నిన్ను నటుడిగా పరిచయం చేశాను. మళ్లీ ఈ రోజు 25 ఏళ్ల తర్వాత నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు నాకు, ఆదిత్య చోప్రాకు సంతోషంగా ఉంది అంటూ రాకేష్ రోషన్ తన పోస్టులో పేర్కొన్నారు.. మా ప్రతిష్టాత్మక చిత్రం 'క్రిష్4'ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు. ఈ కొత్త పాత్రలో నీకు శుభాకాంక్షలు, దీవెనలు!" అని ఆయన రాశారు. అయితే, దర్శకుడిగా తొలి అడుగులు వేయడంపై హృతిక్ రోషన్ కాస్త ఆందోళనగా ఉన్నట్లు చెప్పారు
'క్రిష్' ఫ్రాంచైజ్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన సూపర్ హీరో చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ ప్రయాణం 2003లో 'కోయి... మిల్ గయా'తో మొదలైంది. ఇందులో మానసిక వికలాంగుడైన రోహిత్ మెహ్రా ఒక గ్రహాంతరవాసి అయిన జాదూతో స్నేహం చేయడం చూపించారు. దీని తర్వాత 2006లో వచ్చిన 'క్రిష్', భారతదేశపు మొదటి సూపర్ హీరో కృష్ణ మెహ్రాను పరిచయం చేసింది. ఇక, 2013లో విడుదలైన 'క్రిష్ 3' అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు భావోద్వేగాలను కలిపి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుమారు 94 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 374 కోట్లు వసూలు చేసి భారీ విజయం సాధించింది. ఇప్పుడు 'క్రిష్ 4'తో హృతిక్ దర్శకత్వంలో ఈ ఫ్రాంచైజ్ తన ప్రస్థానాన్ని కొనసాగించనుంది. మరి అభిమానుల అంచనాలను ఏమాత్రం అందుకుంటుందో చూడాలి మరి.